ఆరోగ్య కేంద్రంలో.. ఆకస్మిక తనిఖీ..

ఆరోగ్య కేంద్రంలో.. ఆకస్మిక తనిఖీ..

-వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలి
-రికార్డులను సమయానికి అప్‌డేట్ చేయాలి
-రోగులకు ఆలస్యం లేకుండా చికిత్స అందించాలి
-అత్యవసర సేవల్లో అప్రమత్తంగా ఉండాలి
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్ కుమార్

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎం హెచ్‌ఓ డాక్టర్ సుధీర్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందుతున్నాయా..? లేదా…? అనే దాని పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా వైద్యాధికారిని రిజిస్టర్ వివరాలు, హాజరు పట్టికలు, ఔషధాల నిల్వలు, రోగులకు అందిస్తున్న చికిత్స విధానాల పై వివరంగా అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండాలి. ప్రతి నమోదు సమయానికి అప్‌డేట్ చేయాలని సూచించారు. అలాగే ఆసుపత్రిలోని ఔషధ నిల్వల గదులు, శుభ్రత పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

అనంతరం డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించే వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోగులకు సమయానికి వైద్య సేవలు అందించడం ప్రతి సిబ్బంది బాధ్యత అని, నిర్లక్ష్యం చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, వైద్య సదుపాయాల విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి, సూపర్వైజర్ శ్రీనివాస్, నర్సింగ్ ఆఫీసర్ షాహిన్, ఏఎన్ఎం నాగరాణి, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.