మిల్లర్ల దగా!

మిల్లర్ల దగా!

  • నాణ్యత లేదంటూ బస్తాకు 5 నుంచి 6 కిలోల తగ్గింపు
  • రైతులను దోపిడీ చేస్తున్న మిల్లర్లు
  • ఆరిగోస పడుతున్న అన్నదాతలు
  • కలెక్టర్ ఆదేశాలను బేఖాదర్ చేస్తున్న మిల్లర్లు
  • సివిల్ సప్లయ్ అధికారుల కన్ను సన్నల్లోనే దోపిడీ

తొర్రూరు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలులో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. యంత్రాలతో కోసి ధాన్యం ఆరబెట్టిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని సంచుల్లోకి ఎత్తుతున్నారు. వెంటనే పంపాల్సిన వాహనాలను మిల్లర్లు కావాలని ఆలస్యంగా పంపుతున్నారు. దీంతో ఒకటి రెండు రోజుల పాటు సంచుల్లో నిల్వ ఉన్న ధాన్యంలో తేమశాతం పెరిగి రంగుమారుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లు యజమానులు ధాన్యం నాణ్యతగా లేదని వంకలు పెడుతూ 75 కిలోల బస్తాకు ఐదు నుంచి ఆరు కిలోల వరకు తగ్గించి ఇస్తామని బేరం పెడుతున్నారు.

విధిలేని పరిస్థితుల్లో రైతులు వారు చెప్పినట్టే చేస్తున్నారు. ఒక లారీ ధాన్యానికి రూ.35 వేల వరకు నష్టపోతున్నారు. సెంటర్లలో ధాన్యం తూకం వేసిన తర్వాత రైతులకు ఇస్తున్న దుడువాయి తూనికపట్టి (స్లిప్‌)కు బస్తాల దిగుమతి సమయంలో రైస్‌ మిల్లుల్లో నమోదు చేసే ట్రక్‌షీట్‌కు భారీ తేడా ఉంటుంది. బస్తాలకు బస్తాలే మాయమవుతున్నాయి. సెంటర్లలో ధాన్యం తూకం నుంచి మిల్లుల్లో బస్తాలు దిగుమతి చేసే వరకు తరుగు, తాలు, మట్టి, తడిసిన ధాన్యం నెపంతో రైతుల కష్టాన్ని అందరూ కలిసి వాటాలుగా పంచుకుంటున్నారు.

తొర్రూరు డివిజన్ పరిధిలోని రైస్ మిల్లర్ల తరుగు దందా రైతులను గుబులు పుట్టిస్తుంది. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు అమ్మకానికి తీసుకెళ్లితే కొనుగోళ్లలో ఆలస్యం అన్నదాతను కొనుకు లేకుండా చేస్తుంది. గత కొన్ని రోజులుగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యం ఆరబెట్టినందుకు నాన్న అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలపై కప్పేందుకు కవర్లను అద్దెకు తీసుకొచ్చి రోజుల తరబడి రైతులు కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.దీనికి తోడు ధాన్యం కేటాయింపులకు సంబంధించిన పూర్తిస్థాయిలో మిల్లర్ల టాగంగ్ పూర్తి పూర్తి కాకపోవడంతో ఇల్లాలోని కొనుగోళ్ల ప్రక్రియ నత్త నడకన సాగుతుంది.

ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులను మిల్లర్ల తరుగు గుబులు పుట్టిస్తుంది. కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని ప్రతిరోజు ఎండబెట్టి 97 నుండి 100 శాతం మ్యాచర్ వచ్చినప్పటికీ మట్టి తరుగు, తాలు తరుగు,బస్తా తరుగు అంటూ క్వింటాకు 5 కేజీల పైగా తరుగు తీసేందుకు అంగీకరిస్తేనే మిల్లులో ధాన్యాన్ని దించుకుంటామని తెగేసి చెప్పడంతో రైతులు అకాకవుతున్నారు.

విధి లేని పరిస్థితిలో కొందరు తరుగు అంగీకరిస్తుంటే కొందరు గత్యంతరం లేని పరిస్థితిలో మిల్లర్ల షరతులకు ఒప్పుకొని ఆన్ లోడ్ చేసుకుంటున్నారు.మరికొందరు ప్రవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. సివిల్ సప్లయ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ల ఆదేశాలను మిల్లర్లను బేఖతార్ చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారుల కన్ను సన్నుల్లోనే మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని జోరుగా విమర్శలు వస్తున్నాయి.
తరుగు దందా.. అధికారుల మౌనం…
క్వాలిటీ లేని ధాన్యాన్ని మిల్లుకు పంపాలంటే ప్రభుత్వం నిర్ణయించిన 3 కిలోల తరుగు కాకుండా, అదనంగా 10 కిలోలు ఇస్తేనే కొంటామంటూ మిల్లర్లు మెలిక పెడుతున్నారు. మిల్లర్ల ఈ అక్రమ వసూళ్లకు భయపడి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తీసుకోవడం ఆపేస్తున్నారు. అధికారులు ఈ దోపిడీని అరికట్టాల్సింది పోయి, నాణ్యత లేదనే వంకతో బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. ఆరుగాలం పాటు కష్టపడి పండించిన ధాన్యాన్ని పండించిన అన్నదాతలు అరిగోస పడుతున్నారు. తరుగు పేరిట మిల్లర్లు చేస్తున్న ధాన్యం దోపిడిని అరికట్టేందుకు సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు.

Leave a Reply