లాభసాటి వ్యవసాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

లాభసాటి వ్యవసాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
గొల్లపూడిలో ‘రైతన్నా మీకోసం’
పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : లాభసాటి వ్యవసాయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా డీప్ టెక్నాలజీ, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఘనస్వాగతం పలికారు. రైతు ఇళ్లకు వెళ్లి, వారితో మమేకమై వ్యవసాయం, సాగు పద్ధతులు, గిట్టుబాటు ధర గురించి వాకబు చేశారు. ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కరపత్రాలు అందజేశారు. నీటి భద్రత, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, ఫుడ్ ప్రాసెసింగ్, మరియు మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఏటా రైతు కుటుంబానికి రూ.20 వేల చొపు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద నిధులు అందిస్తున్నట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో దాదాపు 30వేల మంది రైతులకు 2025-26 ఏడాదికి రూ.56.62 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
యువత వ్యవసాయంపై మక్కువ చూపాలంటే వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయంతో పాటు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం ప్రభుత్వం రూపొందించిన పది సూత్రాల్లో ఫార్మర్ అగ్రిటెక్ కీలకమైనదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
