పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం..

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం..

ఏప్రిల్‌ 1 వరకు కొనసాగనున్న పరీక్షలు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కేంద్రాల వద్ద 144 సెక్షన్..
అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటు..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
పర్యవేక్షణకు ప్రత్యేక స్క్వాడ్లు..
అందుబాటులో హెల్ప్ లైన్ నెంబర్..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరీక్షల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా విద్యాశాఖ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల భద్రత నుంచి పరీక్షా కేంద్రాల నిర్వహణ వరకు ప్రతి అంశాన్ని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

జిల్లాల్లో భారీ ఏర్పాట్లు..

ఇక ఎన్టీఆర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి 27,360 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో 13,909 మంది బాలురు, 13,451 మంది బాలికలు ఉన్నారు. జిల్లాలో మొత్తం 149 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, మొబైల్‌ స్క్వాడ్‌ టీంలు నియమించారు. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే 5 మొబైల్ స్క్వాడ్ టీంలు నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నాయి. సెన్సిటివ్‌గా గుర్తించిన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేశారు. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం ఉండేలా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రానికి 1000 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారుల ఆదేశాలు జారీ అయ్యాయి.

అలాగే విద్యార్థులు, సిబ్బంది తప్ప ఇతరులకు కేంద్రాల వద్ద గుమిగూడకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం హాల్ టికెట్ చూపితే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. అవసరమైన చోట అదనపు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పెద్ద ఉపశమనం లభించనుంది. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి.

విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైన విద్యార్థుల కోసం అధికారులు 30 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ప్రకటించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. అవసరమైతే వెంటనే వైద్య సేవలు అందేలా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం పూర్తిగా నిషేధించారు. ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఆధునిక సాంకేతిక సదుపాయాలు..

ఈసారి హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. విద్యార్థులు దాన్ని స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం సరిగ్గా ఉన్న లొకేషన్ తెలుసుకునే సౌకర్యం కల్పించారు. ఇది పరీక్షా కేంద్రాల గుర్తింపులో విద్యార్థులకు, తల్లిదండ్రులకు సౌలభ్యాన్ని కల్పించనుంది. విద్యార్థులకు జవాబులు రాసేందుకు మొదటగా 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. అది పూర్తయితే అదనంగా 12 పేజీల మరో బుక్‌లెట్ అందించనున్నారు. దీంతో విద్యార్థులు పూర్తి వివరాలతో సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం తొలిసారిగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సందేహాలకు హెల్ప్‌లైన్..

పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు 9154970454 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Leave a Reply