పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి..

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి..

  • సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్లబెల్లి బస్టాండ్ సెంటర్‌లో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్‌కు పూలదండలు వేసి, కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితులు ప్రపంచానికి తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అవసరమైన గ్యాస్, చమురు నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

యుద్ధ పరిస్థితుల్లో దేశంలో కేవలం 50 రోజులకు సరిపడా మాత్రమే గ్యాస్, డీజిల్, పెట్రోలు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందన్నారు. అందులో కూడా సుమారు 50 శాతం నిల్వలను సైన్యానికి కేటాయించి, మిగిలిన నిల్వలను 140 కోట్ల ప్రజలకు కేటాయించారని తెలిపారు. ఈ నిల్వలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో గ్యాస్ కంపెనీలు పరిస్థితిని ఆసరాగా చేసుకుని గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను పరిమితం చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వలు తగినంతగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికే చిన్న వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయని.. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వర్కర్లు వేలాదిమంది ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటించకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తలొగ్గడం వల్లే దేశ పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధానికి నిరసనగా ట్రంప్, నెతన్యాహు, మోడీ చిత్రపటాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వైనాల వీరస్వామి, సిపిఐ మండల కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్, మామిండ్ల అయిలయ్య,పిట్టల రామస్వామి,శ్రీహరి,బిట్ల సారంగం,సామాల దేవేందర్,నారాయణస్వామి, బాబురావు,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.