ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు..

ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు..
చారిత్రక ఆధారాలను పరిశీలించిన దేవస్థానం బృందం
ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం పై చారిత్రాత్మకమైన ఆనవాళ్లు పరిశీలించిన ఆలయ అధికారులు పాలకమండలి
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ నగరానికి ఆ పేరు రావడానికి కారణమైన విజయుడు (అర్జునుడు), పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి ఈ పురాణ గాథకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న పాశుపతేశ్వర ఆలయాన్ని దుర్గ గుడి కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ట్రస్ట్ బోర్డు సభ్యులు సందర్శించారు. ఆదివారం దేవస్థానం అర్చకులు, ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి ఈ బృందం కొండపైకి ప్రయాణమైంది. సుమారు గంటన్నర అత్యంత కష్టతర ప్రయాణం తర్వాత కొండపై మారుమూల ప్రాంతంలో ఉన్న పాశుపతేశ్వర ఆలయానికి చేరుకున్నారు. వారణాసి శైలిలో నాలుగు ద్వారాలతో నిర్మితమై, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ చారిత్రక ఆలయాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. మహాభారతంలోని వనపర్వం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధానికి ముందు దివ్యాస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఘోర తపస్సు చేశారు .

ఆ సమయంలో శివుడు కిరాతుడి (బోయవాడు) రూపంలో వచ్చి అర్జునుడితో మల్ల యుద్ధం చేస్తారు. అర్జునుడి పరాక్రమానికి మెచ్చిన శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారు. ఈ ఘట్టానికి గుర్తుగా ఇక్కడ వెలసిన శివలింగాన్ని అర్జునుడే స్వయంగా ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనికి సాక్ష్యంగా 7వ లేదా 8వ శతాబ్దానికి చెందిన ‘కిరాతార్జునీయ’ శిలాశాసనం ఇదే వివరిస్తుంది.అయితే కాలక్రమంలో శివ లింగం భూమిలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణ కోసం భక్తుల నుండి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపాము. కొండపైకి వెళ్లే దారిని సుగమం చేయడం, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం వంటి పనులపై దేవదాయ శాఖ మంత్రి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ట్రస్ట్ బోర్డు సభ్యులు హరికృష్ణ, దేవస్థానం ఇంజినీరింగ్ సిబ్బంది ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

