గ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దు…

గ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దు…
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గ్యాస్ ఏజెన్సీల వద్ద తాసిల్దార్ ల నియామకం
బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు
జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్
చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై సందేహాలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08572-242734కు సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గృహ వినియోగదారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.
వినియోగదారులు సరఫరాపై సమాచారం తెలుసుకోవడానికి చిత్తూరు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ప్రతి పని దినంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని తెలిపారు..జిల్లాలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తగిన గ్యాస్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్యాస్ సరఫరా ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద తహశీల్దార్లను నియమించినట్లు తెలిపారు. ప్రజలు తొందరపడి వరుసగా గ్యాస్ రీఫిల్లింగ్ బుకింగ్‌లు చేసుకోవద్దని, గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు.
వినియోగదారులు గ్యాస్ బిల్లులో పేర్కొన్న ధర మాత్రమే డెలివరీ బాయ్‌కు చెల్లించాలని, అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరైనా ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే గృహ వినియోగానికి కేటాయించిన డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సంస్థలపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీ యజమానులు వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిండు సిలిండర్లను సమయానికి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ ఆదేశించారు.
