హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండి

హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండి
మైలవరం, ఆంధ్రప్రభ: ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని మైలవరం సీఐ కిషోర్ బాబు ప్రజలను కోరారు. విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు(ఐపీఎస్) ఆదేశాల మేరకు, డిసిపి రూరల్ శ్రీ లక్ష్మీనారాయణ, (ఐపీఎస్)ఏసీపీ మైలవరం సబ్ డివిజన్ ప్రసాదరావు వారి సూచనల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మైలవరం పోలీసుల ద్వారా గురువారం అవగాహన కల్పించారు.
ఇందులో భాగంగా సీఐ కె. కిషోర్ బాబు వాహనదారులకు హెల్మెట్ యొక్క ఆవశ్యకతను వివరించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించినప్పుడు ముఖ్యంగా టూ వీలర్ రైడర్లు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తీవ్ర గాయాల పాలవ్వడం,కొన్ని సందర్భలలో మరణాలు సంభవించడం దురదృష్టకరమని అన్నారు.రోడ్డు ప్రమాదాలు, మరణాలు అరికట్టెందుకే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మైలవరం పట్టణంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.
హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి వారితో హెల్మెట్లు కొనుగోలు చేయించి, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించి పంపించడం జరిగింది.పుచ్చకాయను రోడ్డుపై పడగొట్టి అది ఎలా పగులుతుందో చూపిస్తూ, ప్రమాదాల సమయంలో హెల్మెట్ లేకపోతే మన తల కూడా అదే విధంగా తీవ్రంగా దెబ్బతింటుందని ప్రేత్యక్షంగా చూపించి వాహనదారులకు అవగాహన కల్పపించారు.
ప్రధాన రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనం నడిపే వ్యక్తి వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు.హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చట్టప్రకారం వాహనాన్ని సీజ్ చేయడం, జరిమానా విధించడం, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్‌కు సిఫారసు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.మన కుటుంబాలకు మనం ఎంతో అవసరం,కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ కిషోర్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
