ప‌చ్చ‌ని ప‌రిశ్ర‌మ‌ల‌కు చేయూత‌నిద్దాం..

ప‌చ్చ‌ని ప‌రిశ్ర‌మ‌ల‌కు చేయూత‌నిద్దాం..

గ్రీన్ ఆంత్ర‌ప్రెన్యూర్‌షిప్ ను ప్రోత్స‌హిద్దాం
ప్టాస్టిక్ ర‌హిత స‌మాజ నిర్మాణానికి చేయీచేయీ క‌లుపుదాం
స్వ‌చ్ఛాంధ్ర‌-స్వ‌ర్ణాంధ్ర కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

కంచికచర్ల, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడే గ్రీన్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, ఈ దిశ‌గా ఔత్సాహికుల‌ను చేయిప‌ట్టి న‌డిపించాల‌ని జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం కంచిక‌చెర్ల మండ‌లం, ప‌రిటాల గ్రామ చెత్త నుంచి సంప‌ద సృష్టి కేంద్రం (ఎస్‌డ‌బ్ల్యూపీసీ) వ‌ద్ద పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛాంధ్ర‌-స్వ‌ర్ణాంధ్ర కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొని ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటారు. అంగ‌న్వాడీ, వైద్య ఆరోగ్యం, ప్లాస్టిక్ ప్ర‌త్యామ్నాయాలు, వ‌ర్మీ కంపోస్టు త‌దిత‌ర స్టాళ్ల‌ను సంద‌ర్శించారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారితో స్వ‌చ్ఛాంధ్ర‌-స్వ‌ర్ణాంధ్ర ప్ర‌తిజ్ఞ చేయించారు.

త‌డిచెత్త‌, పొడి చెత్తను వేరుచేసి ఇస్తూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న మ‌హిళ‌ల‌ను స‌త్క‌రించారు. అదేవిధంగా గ్రీన్ అంబాసిడ‌ర్ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేశారు. ఎస్‌డ‌బ్ల్యూపీసీ షెడ్‌కు చేరిన ప్లాస్టిక్‌ను స్వ‌చ్ఛ ర‌థానికి అంద‌జేయ‌గా బ‌దులుగా పుస్త‌కాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతోందని.. భూమి, నీరు, గాలి కాలుష్యానికి ఇది ప్రధాన కారణంగా మారుతోందని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వినియోగించ‌వ‌ద్ద‌ని కోరారు. అదేవిధంగా స్వయం ఉపాధి దిశగా యువత గ్రీన్ పరిశ్రమలపై దృష్టి సారించాలని, పేపర్ బ్యాగులు, జ్యూట్ ఉత్పత్తులు, సహజ సిద్ధ పదార్థాలతో తయారయ్యే వస్తువులకు ప్రోత్సాహం పెరుగుతోందని తెలిపారు. రీసైక్లింగ్‌, కంపోస్టింగ్‌, అప్ సైక్లింగ్‌, రిపైర్ అండ్ రీయూజ్ వ్యాపారాల‌పై దృష్టిసారించేలా ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇలాంటి పరిశ్రమలు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడతాయని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ ల‌క్ష్మీశ‌ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీపీవో పి.లావ‌ణ్య‌కుమారి, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, స్థానిక అధికారులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

Leave a Reply