ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు నియోజకవర్గంలో రూ.5.15 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

తిరువూరు, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అత్యవసర వైద్య ఖర్చులకు పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రజాహిత పాలనకు నిదర్శనమని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు రావు అన్నారు. గురువారం తిరువూరు రూరల్ మరియు పట్టణ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తోందన్నారు. పేదలు వైద్య ఖర్చుల భారం వల్ల ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

తిరువూరు మండలంలోని అక్కపాలెం, మునుకుళ్ల, ఎర్రమాడు, వావిలాల, ముష్టికుంట్ల, గానుగపాడు, జి.కొత్తూరు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం 8 చెక్కులు అందజేశారు. ఈ గ్రామాల్లో పంపిణీ చేసిన చెక్కుల మొత్తం విలువ రూ.3,61,587గా ఉంది. అలాగే తిరువూరు పట్టణంలోని 14వ, 8వ, 4వ, 1వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు మరో నాలుగు చెక్కులు పంపిణీ చేశారు. పట్టణ ప్రాంతంలో పంపిణీ చేసిన చెక్కుల విలువ రూ.1,54,301గా ఉంది. గ్రామాలు, పట్టణం కలిపి మొత్తం 12 మందికి రూ.5,15,888 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నిజమైన అర్హులకు చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుండి పనిచేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే తన రాజకీయ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply