హామీలన్నీ గాలికొదిలేశారు..
డీఎస్సీని అవినీతిమయం చేశారు
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి..
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి..
నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలి
వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి
(కృష్ణలంక, ఆంధ్రప్రభ) : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. డీఎస్సీ నియామకాలను పూర్తిగా అవినీతిమయం చేసి యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, గోల్డ్ మెడలిస్టులకు రావాల్సిన ఉద్యోగాలను సైతం డబ్బులకు అమ్మేశారని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ సమస్యలపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారితోట సర్వీస్ రోడ్డులో నిర్వహించిన దీక్షా శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
గతంలో చంద్రబాబు ఒక్కరే అవినీతికి ప్రతీకగా ఉండేవారని, ఇప్పుడు లోకేష్ కూడా అదే బాటలో నడుస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. మహిళలపై దాడులు పెరిగాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, అర్హులైన యువతకు రావాల్సిన ఉద్యోగాలను డబ్బులకు విక్రయించారని విమర్శించారు. అధికారం కోసం మానవత్వాన్ని మరిచిపోయారని, ప్రజలను మోసం చేసిన వారికి చట్టం ముందు తప్పక శిక్ష పడుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు. లక్ష్మీపార్వతి చేతుల మీదుగా దీక్షా శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. స్కామ్‌లకు కూటమి ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పాలన సాగించారని అవినాష్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి యువత, విద్యార్థులు, నిరుద్యోగులను నిరాశపరిచిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువతకు వైసీపీ అండగా నిలుస్తుందని అవినాష్ స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన డీఎస్సీ అక్రమాలు, యువత సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, పార్లమెంట్ కార్యదర్శులు ఆళ్ల చెల్లారావు, తంగురాల రామిరెడ్డి, పెన్షన్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పుప్పాల కుమారి, మండల అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి, పంతాల సాయిబాబు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
