ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరండి..

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరండి..

అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి భారీ స్పందన
తెలంగాణ పురుష అభ్యర్థులకు మార్చి 15న గుంటూరులో అవకాశం

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అనూహ్య స్పందన లభిస్తోంది. సెంట్రల్ ఎయిర్‌మెన్ సెలెక్షన్ బోర్డు (CASB) ప్రెసిడెంట్ గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ చబ్బా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల యువతకు ఇది గొప్ప అవకాశమని, ఎయిర్‌ఫోర్స్‌లో చేరి అద్భుత భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఏపీ నుండి 7 వేల మంది హాజరు..

మార్చి 12న ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు నిర్వహించిన ర్యాలీకి దాదాపు 7 వేల మంది హాజరయ్యారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళా అభ్యర్థుల నుంచి వెయ్యి మంది పాల్గొన్నారు. అభ్యర్థులు రాత్రి నుంచే రావడం ప్రారంభించగా, అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, విశ్వవిద్యాలయం, పోలీస్ శాఖలు మంచి సహకారం అందించాయని పేర్కొన్నారు.

తెలంగాణ పురుష అభ్యర్థులకు మార్చి 15న ర్యాలీ..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పురుష అభ్యర్థులకు మార్చి 15న ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా పాల్గొనవచ్చు. ఎలాంటి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

అర్హతల వివరాలు…

  • పురుష అభ్యర్థులు: అవివాహితులు, జనన తేదీ జూలై 2, 2005 నుంచి జనవరి 2, 2009 మధ్య ఉండాలి.
  • విద్యార్హత: ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమానం, లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత. మొత్తం మార్కుల్లో 50% మరియు ఇంగ్లీష్‌లో 50% తప్పనిసరి.
  • శారీరక అర్హత: కనీస ఎత్తు 152 సెం.మీ.
  • పరీక్షలు: 1.6 కి.మీ. పరుగు, భౌతిక పరీక్షలు, రాత పరీక్ష (ఇంగ్లీష్, హిందీలో; తప్పు జవాబుకు 0.25 మార్కు తగ్గింపు), అడాప్టబిలిటీ టెస్టులు, మెడికల్ పరీక్షలు.

తప్పనిసరి పత్రాలు…

అభ్యర్థులు ఒరిజినల్/డిజిటల్ ధృవీకరణతో X, XII సర్టిఫికేట్లు (లేదా తత్సమానం), డొమిసైల్ సర్టిఫికేట్, NCC సర్టిఫికేట్ (ఉంటే), ఆధార్ కార్డ్, ఈ-మెయిల్, మొబైల్ నంబర్, ఇటీవలి 10 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ప్రతి సర్టిఫికేట్‌కు 6 జిరాక్స్ కాపీలు తీసుకురావాలి.

ప్రవేశ సమయం నిబంధన…

తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15న ఉదయం 4 గంటల నుంచి ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అయితే ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశం లేదు. విజయవాడ, గుంటూరు నుంచి ఆర్‌టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

అధికారులు మధ్యవర్తులను నమ్మవద్దని, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.agnipathvayu.cdac.in సందర్శించవచ్చు.

Leave a Reply