అనుమానాస్పద కాల్స్, మెసేజీలను నమ్మవద్దు

అనుమానాస్పద కాల్స్, మెసేజీలను నమ్మవద్దు

డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి : జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : బ్యాంకుల పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలను నమ్మకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సూచించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల్లో డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూపొందించిన ప్రజా అవగాహన పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు.

మార్చి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్న డిజిటల్ పేమెంట్స్ అవగాహన కార్యక్రమాల భాగంగా ఈ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ చెల్లింపులు వేగవంతంగా, సురక్షితంగా ఉండే విధానమని తెలిపారు. అయితే ప్రజలు తమ ఓటీపీ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. బ్యాంక్ పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్, మెసేజీలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాల నుండి రక్షణ పొందేందుకు అధికారిక బ్యాంకింగ్ యాప్స్ మరియు నమ్మకమైన వెబ్‌సైట్ల ద్వారానే లావాదేవీలు చేయాలని ప్రజలకు సూచించారు.

ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే సంబంధిత బ్యాంక్ లేదా అధికారులకు తెలియజేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం అందించాలని బ్యాంక్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం రామచంద్రరావు, ఆర్బీఐ లీడ్ బ్యాంక్ అధికారి రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం సుబ్బారెడ్డి, కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ గౌతమ్, సీబీఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ పుష్పకుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply