Rs.8.70 cr | తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు..

Rs.8.70 cr | తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు..

అభివృద్ధికి కృషి చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని)
నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రూ.8.70 కోట్ల సాస్కీ నిధులు..
నిధుల మంజూరుకు ఆర్ అండ్ బి శాఖా మంత్రి బీసీ జనార్ధన రెడ్డిని కలిసి కృషి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్..
ఎంపీ విజ్ఞాపనకు స్పందించి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
తిరువూరు నియోజకవర్గం కు అత్యధిక నిధులు కేటాయింపు..

Rs.8.70 cr | తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బాటలు వేస్తున్నారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తిరువూరు ప్రాంత అభివృద్ధిపై, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న పలు రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సంబంధిత రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పలుమార్లు కలిసి విజ్ఞాపనలు అందజేశారు.

గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన మంత్రి బిసి జనార్ధన రెడ్డిని సచివాలయంలో కలిసిన ఎంపీ కేశినేని చిన్ని నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలో ప్రస్తుత రహదారులు, వంతెనల పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శిథిలావస్థలో ఉన్న ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధాన మార్గాలు, వంతెనల మరమ్మతుల అవసరాన్ని వివరించారు.

ప్రజలకు సులభ రవాణా సౌకర్యం అందించాలంటే తక్షణమే రహదారుల నిర్మాణాలు, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రోడ్లు కీలకమని, త్వరితగతిన పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అప్పట్లో మంత్రిని సచివాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రహదారుల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు.

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కృషితో తాజాగా నియోజక వర్గంలో పలు అభివృద్ధికి ఆర్ అండ్ బి శాఖ నుంచి రూ.8.70 కోట్ల సాస్కీ నిధులను మంత్రి జనార్దన్ రెడ్డి మంజూరు చేస్తూ ప్రభుత్వపరంగా జీవో జారీ చేశారు. దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు ఆర్ అండ్ బి శాఖ ద్వారా మంజూరు చేసినట్లు ఎంపీ కేసినేని శివనాద్ ( చిన్ని) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు .

ఈ మేరకు ఎం.డి.ఆర్ అండ్ ఎస్.హెచ్ ప్రపోజల్స్ అప్‌గ్రేడేషన్ల కింద, రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల మెరుగుదలకు సంబంధించి నిధుల విడుదల చేస్తూ ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే తిరువూరు నియోజకవర్గానికి అత్యధికంగా రూ. 8.70 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.

మంజూరైన పనుల వివరాలు..

  1. రూ.2.10 కోట్ల నిధులతో నందిగామపుట్రేల రోడ్డు, శ్రీరామ్‌పురం పేరువంచ రహదారులను అభివృద్ధి చేయడం
  2. రూ. 2.20 కోట్ల వ్యయంతో తిరువూరు` తునికిపాడు రహదారి అభివృద్ధి
  3. రూ. 2.40 కోట్ల నిధులతో శ్రీనికేతన్కొత్తపల్లి రహదారి, కొత్తపాడు కాకర్ల రోడ్డు అభివృద్ధి
  4. రూ. 30లక్షల వ్యయంతో కోటపాడు` కాకర్ల రోడ్డు అభివృద్ధి
  5. రూ. 30లక్షల వ్యయంతో గంపలగూడెం` గోసవీడు రహదారి అభివృద్ధి
  6. రూ. 25 లక్షల వ్యయంతో ఎంఎన్‌కె రోడ్డు` పోలవరం రోడ్డు అభివృద్ధి
  7. రూ. 25లక్షల వ్యయంతో మారెపల్లి` కొత్తూరు (వయా) గున్నచింతలపాడు రహదారి అభివృద్ధి
  8. రూ. 25లక్షల వ్యయంతో విస్సన్నపేటలక్ష్మీపురం రోడ్డు నుంచి తెల్లాడవారపల్లి అమ్మపాలెం రోడ్డు అభివృద్ధి
  9. రూ. 20లక్షల వ్యయంతో పుట్రేల` కుంచిపర్తి (వయా) నర్మదానగర్ రహదారి అభివృద్ధి
  10. రూ. 10లక్షల వ్యయంతో టిటి రోడ్డు` టిఆర్ రోడ్డు ( లింకు రోడ్డు ) అభివృద్ధి
  11. రూ. 35లక్షల వ్యయంతో చెన్నవరం` మల్లవరం రహదారి అభివృద్ధి

మొత్తంగా 11 రహదారులకు కలిపి సుమారుగా 63 కిలో మీటర్ల మేర అభివృద్ధికి గానూ రూ.8.70 కోట్ల మేర నిధులను తిరువూరు నియోజకవర్గంకు కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంబంధిత మంత్రి జనార్దన్ రెడ్డికు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివ నాథ్ ( చిన్ని) ధన్యవాదాలు తెలిపారు.

నిధుల కేటాయింపుతో రహదారుల సత్వర అభివృద్ధి జరిగి ప్రజలకు మేలు చేకూరుతుందని, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వపరంగా నిధులు కేటాయింపుల ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు సమకూరనున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు రహదారుల నిర్మాణంతో పురోగతి సాధ్యపడుతుందని, పార్లమెంటు నియోజకవర్గ పరిధి లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.