దశాబ్ద కాలపు నాలా సమస్యకు ‘ప్రజాపాలన’లో మోక్షం…

దశాబ్ద కాలపు నాలా సమస్యకు ‘ప్రజాపాలన’లో మోక్షం…
యుద్ధప్రతిపదికన పూడికతీత పనులు
హనుమాన్ బస్తీ, రాంనగర్, బాబు క్యాంప్ వాసుల దశాబ్దాల కల సాకారం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ, బాబు క్యాంప్, రాంనగర్ మీదుగా వెళ్లే ప్రధాన నాలా సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గత పదేళ్లుగా ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడికతో నిండిపోయి, మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతున్న ఈ నాలాను ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం జేసీబీతో శుభ్రం చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో, మున్సిపల్ కమిసనర్ సంపత్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ ల పర్యవేక్షణలో మున్సిపల్, సింగరేణి అధికారుల సమన్వయంతో ఈ పనులు చేపట్టారు.
ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఈ నెల 7వ తేదీన ఎమ్మెల్యే వినోద్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, కమిషనర్ సంపత్‌తో కలిసి ఈ నాలాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం విదితమే. ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే స్పందించి, సింగరేణి జీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. చైన్ జేసీబీ సాయంతో పూడికను తొలగించాలని సింగరేణి అధికారులకు సూచించారు.

ఈ క్రమంలో సోమవారం సానుకూలంగా స్పందించిన సింగరేణి ఏరియా జీఎం రాధాకృష్ణ సోమవారం ఉదయమే భారీ జేసీబీ పంపి పనులను ప్రారంభించారు. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో మురుగునీటి ప్రవాహం సాఫీగా సాగుతోంది. పదేళ్లుగా ఎవరూ పట్టించుకోని ఈ సమస్యను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరించడంపై బస్తీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యను గుర్తించి పరిష్కరించిన ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామికి, కలెక్టర్ కుమార్ దీపక్‌కు, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతికి బస్తీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని 34 వార్డులలో పారిశుధ్య నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ సంపత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
