వాటర్ ప్యూరిఫైయర్ల పంపిణీ..

వాటర్ ప్యూరిఫైయర్ల పంపిణీ..

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా కెనరా బ్యాంక్ సహకారంతో జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలకు వాటర్ ప్యూరిఫైర్లను పంపిణీ చేశారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఈ ప్యూరిఫైర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో సుమారు ₹12.50 లక్షల వ్యయంతో 10 వాటర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లాలోని BC, SC, ST సంక్షేమ వసతి గృహాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.

జిల్లాలో మొత్తం 62 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయని, దశల వారీగా అన్ని వసతి గృహాలకు ఈ సదుపాయాన్ని విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఒకే చోట నివసిస్తుండటంతో వారికి శుభ్రమైన తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాటర్ ప్యూరిఫైర్ల ఏర్పాటు వల్ల విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందడంతో పాటు ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారులు, కెనరా బ్యాంక్ ప్రతినిధులు, వసతి గృహాల వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply