వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి పల్లకి సేవ
వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి పల్లకి సేవ
భక్తులతో కిటకిటలాడిన దేవాలయం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో శనివారం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా స్వామివారి దేవాలయంలో నెల పూజోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామి వారి మూలవిరాట్ కు అభిషేకం, పుష్పాలతో, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరణ, అర్చనలు, పూజ కార్యక్రమాలను, మహా మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు.
భూదేవి శ్రీదేవి సమేతుడైన నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువదీర్చారు. భాజా భజత్రీల నడుమ స్వామివారిని దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకోవడానికి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో, దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడిన తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఈవో సాకే రమేష్ బాబు, దేవాలయ మండలి చైర్మన్ రేగటి నాగరాజు, సభ్యులు మీనుగ రామకృష్ణ, ఇంద్రావతి సుధాకర్, ఓబులేసు, మోపిడి గోవిందు, ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, అర్చకులు మయూరం బాలాజీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
