అక్షరాంధ్రకు వేగం పెంచండి!

అక్షరాంధ్రకు వేగం పెంచండి!

గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

రాప్తాడు, ఆంధ్రప్రభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాప్తాడు మండల కేంద్రంలోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమం కింద జరుగుతున్న అభ్యాసకుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. వెల్ఫేర్ అసిస్టెంట్లతో మాట్లాడి నమోదు ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అభ్యాసకుల నమోదు పనులను వేగవంతం చేసి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు.

రాప్తాడు మండలంలో మొదటి విడతలో అభ్యాసకుల ఉత్తీర్ణత శాతం, రెండో దశ కార్యక్రమానికి గుర్తించిన అభ్యాసకుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా శిక్షణా కార్యక్రమాలు, అభ్యసన కేంద్రాల ఏర్పాటు, అభ్యసన సామగ్రి పంపిణీ, తరగతుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అక్షరాస్యత పెంపు లక్ష్యంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్ చెన్నకేశవులు, డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్‌బాబు, అచ్యుతానందబాబు, ఏవో కృష్ణచైతన్య, వయోజన విద్య ఉపసంచాలకులు ఎస్. వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు జి.వి. రమణ, ఏపీఎం సునీత, ఏపీవో సావిత్రి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply