హెచ్ పీవీ టీకాతో బాలికలకు భరోసా

హెచ్ పీవీ టీకాతో బాలికలకు భరోసా
తొర్రూరు, ఆంధ్రప్రభ : హెచ్ పీవీ టీకాతో బాలికల ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు తెలిపారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కు చెందిన 14–15 ఏళ్లలోపు బాలికలకు హెచ్ పివి వ్యాక్సినేషన్ ప్రారంభించారు.
18 మంది బాలికలకు టీకాలు వేశారు.టీకా తీసుకున్న బాలికలకు వైద్యులు ముత్యాల గొలుసులు బహుకరించారు.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులను డాక్టర్ సుగుణాకర్ రాజు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సుధీర్ రెడ్డి లు శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ….క్యాన్సర్ ను నివారించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ హెచ్ పీవీ టీకా ఖరీదు ప్రైవేటులో భారీగానే ఉందని,వయసును బట్టి రెండు, మూడు డోసులుగా అందిస్తుండగా ఒక్క డోసు ధర సుమారు రూ.3వేలకు పైగా ఉండటంతో చాలామంది పేదలు స్వీకరించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండటంతో ఉపశమనం లభించినట్లయిందన్నారు.
యుక్త వయసు బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను ఆదిలోనే కట్టడి చేసేందుకు ఈ టీకా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి నందనాదేవి, వైద్యులు ప్రియాంక,మీరాజ్, శంకర్, మానస, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
