పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలి
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాయాలని రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత, కోరుట్ల మండలం ఎకిన్పూర్ పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ మార్గం రాజేంద్రప్రసాద్ సూచించారు.
కమ్మర్పల్లి మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే జవాబులు రాయడం ప్రారంభించకుండా ముందుగా ప్రశ్నలను పూర్తిగా చదివి, ఎన్ని మార్కులకు ప్రశ్న అడిగారో తెలుసుకుని తగిన విధంగా సమాధానం రాయాలని సూచించారు.
సరైన సమాధానం రాయగలమన్న నమ్మకం ఉన్న ప్రశ్నలను ముందుగాAttempt చేయాలని, ఛాయిస్ ఉన్నప్పుడు ప్రశ్నలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని తెలిపారు. కఠినంగా అనిపించే ప్రశ్నలపై ఆందోళన చెందకుండా, ముందుగా సులభమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి తరువాత కఠిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చెప్పారు. విద్యార్థులు ఎరుపు సిరా పెన్ను వాడకూడదని, జవాబులను వ్యాసరూపంలో కాకుండా పాయింట్ల రూపంలో రాయాలని, సైడ్ హెడ్డింగ్స్ను అండర్లైన్ చేయాలని సూచించారు. మంచి చేతిరాత ఉంటే పేపర్ దిద్దే ఉపాధ్యాయుడికి మంచి అభిప్రాయం కలుగుతుందని తెలిపారు. బిట్ పేపర్లో కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియాలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కోనాపూర్ నివాసి డాక్టర్ శనిగరపు మల్లేశ్ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాల దశలోనే ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని, లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడకుండా ముందుకు సాగాలని సూచించారు. తమ చదువుల సమయంలో అనేక కష్టాలు ఎదురైనా కృషితోనే ఉన్నత స్థాయికి చేరుకున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గం రాజేంద్రప్రసాద్, డాక్టర్ శనిగరపు మల్లేశ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
