వైభవంగా మహా కుంభాభిషేక మహోత్సవం..

వైభవంగా మహా కుంభాభిషేక మహోత్సవం..

దుర్గమ్మ సన్నిధిలో ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు..
మహోత్సవాల్లో సతీసమేతంగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
ఘన స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయక్
అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి దర్శనం
బంగారు తాపడ రాజగోపురానికి నమస్కరించి ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. కుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు శనివారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) సతీసమేతంగా మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, జానకీ లక్ష్మీ దంపతులకు ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ, దేవస్థానం ఈవో శీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేద పండితులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ దంపతులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని బంగారు తాపడ రాజగోపురానికి నమస్కరించి దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. మహా కుంభాభిషేక మహోత్సవాలు విజయవంతంగా కొనసాగాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. వేద ఆశీర్వచనం అనంతరం ఎంపీ దంపతులకు ఈవో చైర్మన్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply