world cup| ఇంటికా.. సెమీస్‌కా..?

world cup| ఇంటికా.. సెమీస్‌కా..?
నేడు భారత్, వెస్టిండీస్ ఢీ
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్
రాత్రి 7గంటలకు ఆట ఆరంభం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా ఆదివారం జరగనున్న కీలక మ్యాచ్‌లో భారత్ జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది. సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. గ్రూప్ 1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆడిన రెండు మ్యాచుల్లో రెండూ ఓడిన జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో మిగిలిన ఒక్క బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇందులో నెగ్గిన జట్టు సెమీస్‌కు, ఓడిన టీమ్ ఇంటికి వెళ్తాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. రాత్రి 7గంటలకు ఆట ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. ప్రత్యర్థి వెస్టిండీస్ మాత్రం గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీతో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.
భారత జట్టు బ్యాటింగ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చినప్పటికీ బౌలింగ్‌లో మాత్రం ఇంకా లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. జింబాబ్వేపై భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ తిలక్ వర్మ మిగతా బ్యాటర్లు కూడా రాణించారు. కానీ, బౌలింగ్ విభాగం మాత్రం టీమ్ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా రాణిస్తున్నా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన పాత ఫామ్ కోసం కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. శివం దూబే బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఈ టోర్నీలో వెస్టిండీస్ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోంది. సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయే వరకు వారు వరుసగా ఐదు విజయాలు సాధించారు. ఇక సౌతాఫ్రికా మ్యాచ్‌లోనూ విండీస్ బ్యాటర్ల పరాక్రమం స్పష్టంగా కనిపించింది. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా ఆ జట్టు సౌతాఫ్రికాకు లొంగిపోలేదు. అద్భుతంగా పోరాడిన రొమారియో షెపర్డ్, హోల్డర్ జట్టుకు 176 పరుగుల పోరాడగలిగే స్కోరు అందించారు.
