Israel | ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్నా భారత్ అండ

Israel | ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్నా భారత్ అండ
Israel | అమెరికాలో ఇజ్రాయెల్‌కు తగ్గుతున్న ఆదరణ
భారత్ నుంచే తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని వ్యాఖ్య
గత భారత పర్యటనను ‘లవ్ ఫెస్ట్’గా అభివర్ణించిన నెతన్యాహు
Israel | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి భారత్‌పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ దేశం ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ భారత్‌లో మాత్రం తమకు అద్భుతమైన మద్దతు లభిస్తోందని అన్నారు. గురువారం వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “భారత్ ఒక అతిపెద్ద శక్తి. ఆ దేశంతో మాకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మా ప్రతిష్ఠకు సవాలు ఎదురవుతోంది. కానీ, ఇండియాలో మాత్రం మాకు ఎలాంటి సమస్యా లేదు. అక్కడ ఇజ్రాయెల్ పట్ల ప్రజల్లో పిచ్చి అభిమానం ఉంది. అది నిజంగా అసాధారణం” అని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రపంచంలో మరే దేశం నుంచి లేనంతగా, భారత్ నుంచే తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని ఆయన తెలిపారు.
నెతన్యాహుకు అమెరికాలో తగ్గుతున్న ఆదరణ
అయితే, అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికాలో నెతన్యాహు ప్రజాదరణ తగ్గుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏప్రిల్‌లో ప్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మందికి ఇజ్రాయెల్‌పై ప్రతికూల అభిప్రాయం ఉంది. గత ఏడాది ఇది 53 శాతంగా ఉండేది. అలాగే, 59 శాతం అమెరికన్లు నెతన్యాహు అంతర్జాతీయ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారనే నమ్మకం లేదని వెల్లడించారు. గతంలో కూడా నెతన్యాహు అనేక సందర్భాల్లో భారత్‌పై ప్రశంసలు కురిపించారు. 2018లో తన భార్య సారాతో కలిసి భారత్‌లో పర్యటించినప్పుడు తనకు లభించిన ఆదరణను ఆయన ‘లవ్ ఫెస్ట్’ (ప్రేమ పండుగ)గా అభివర్ణించారు. భారతీయులకు ఇజ్రాయెల్ పట్ల అపారమైన గౌరవం ఉందని ఆయన పలుమార్లు చెప్పారు.
పాకిస్థాన్‌పై ఆరోపణ
ఇదే సమయంలో అమెరికాలో తన ఆదరణ తగ్గడానికి పాకిస్థాన్ కారణమని నెతన్యాహు ఆరోపించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను దెబ్బతీయాలనుకునే దేశాలు సోషల్ మీడియాలో బాట్ ఫామ్స్ ద్వారా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. “పాకిస్థాన్‌లోని బేస్‌మెంట్‌లో కూర్చున్న ఎవరో ఒక వ్యక్తి, ‘నేను ఇజ్రాయెల్ మద్దతుదారుడిని, కానీ ఇప్పుడు వారిని భరించలేకపోతున్నాను’ అని పోస్టులు పెడుతున్నారు” అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
