ప్రణాళిక బద్ధంగా చదివితే..

ప్రణాళిక బద్ధంగా చదివితే..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని చౌటుప్పల్ ఎంఈఓ గురువారావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ఐరా గ్లోబల్ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వివిధ అంశాల పై రూపొందించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, అతిథులు హర్షాతిరేకాలతో అభినందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఈఓ గురువారావు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
