ఉపాధి హామీ పనుల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రమదానం

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో వికారాబాద్‌లో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా, శనివారం వికారాబాద్ జిల్లా మదనపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో టిపిసిసి ఉపాధ్యక్షులు, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.
సేవాగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ చట్టం అమలుతీరు, కూలీలు పొందుతున్న లబ్ధి గురించి కార్మికులను అడిగి తెలుసుకున్న ఆయన, స్వయంగా పనుల్లో పాల్గొని తట్ట మోసి కూలీలతో కలిసి పని చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే కాకుండా గ్రామాభివృద్ధికి ఈ పథకం దోహదపడుతోందని పేర్కొన్నారు.
కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా విన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కూలీల జీవనోపాధికి భరోసాగా నిలుస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ, శిక్షణతో పాటు సేవాగ్రామ్ కార్యక్రమాలను కూడా పరిశీలిస్తున్నారు. వికారాబాద్‌లో కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో కీలకంగా నిలుస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
