ఖమ్మంలో దాతల భూములపై డేగకన్ను..

ఖమ్మంలో దాతల భూములపై డేగకన్ను..

  • బడా బాబుల విలాసాల కోసమే పేదల ఇళ్ల కూల్చివేతలు!
  • రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు
  • జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో పేదల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోందని, బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కనికరం లేకుండా నేలమట్టం చేస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. గురువారం ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రులు, రెవెన్యూ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. దాతలు పేదల కోసం ఇచ్చిన భూములను కాజేయాలని చూస్తున్న అధికార పక్ష నేతల కుట్రలను వారు తీవ్రంగా ఎండగట్టారు.

దశాబ్దాల క్రితం దాతలు పేదల నివాసాల కోసం దానంగా ఇచ్చిన భూముల్లో చిన్నపాటి గుడిసెలు వేసుకుని జీవిస్తున్న అమాయక ప్రజలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లి పంచనామాలు చేసి, వారి నుంచి ఆధార్ కార్డులు లాక్కొని, కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండానే రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మహిళలు అనక రోడ్డున పడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా అధికారుల్లో కనీస మానవత్వం లోపించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ కమీషన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు.

ఈ భూముల వెనుక ఉన్న చరిత్రను బీజేపీ నాయకులు మీడియాకు పూసగుచ్చినట్లు వివరించారు. 1954వ సంవత్సరంలో భూదాన ఉద్యమ స్ఫూర్తితో కల్వల రాజేశ్వరరావు అనే దాత పేదల నివాసాల కోసం సుమారు 62 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారని గుర్తుచేశారు. సర్వే నెంబర్లు 147, 148, 149 తదితర నెంబర్లలో ఉన్న ఈ భూములను అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం నుంచి మొదలుకొని, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల వరకు ఏ ఒక్కరూ పేదలకు పంచాలనే కనీస ఆలోచన చేయలేదని విమర్శించారు. దాతల ఆశయాలకు గండికొడుతూ, ఇప్పుడు ఆ భూములను ఆక్రమించి, పేదలను గెంటివేసి, బడా బాబుల విలాసాల కోసం ఖమ్మంలో ‘జూబ్లీహిల్స్’ తరహా కాలనీలను నిర్మించాలని మంత్రులు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి మంత్రులు మూడు ప్రభుత్వాలు మారినా పదవుల్లో ఉంటూ పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆ లోటును పూడ్చుకునేందుకే ఇలాంటి భూముల అమ్మకాలకు తెరలేపిందని బీజేపీ నేతలు ఆరోపించారు. బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ పన్నెండు నెలల కాలానికి సుమారు రూ. 2,30,000 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, కేవలం రూ. 1,40,000 కోట్లు మాత్రమే ఖజానాకు చేరిందని లెక్కలతో సహా వివరించారు. సుమారు 90 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటులో ఉన్న ప్రభుత్వం, ఆ ఖాళీని భర్తీ చేసుకునేందుకు దాతలు పేదల కోసం ఇచ్చిన భూములను సైతం అమ్ముకునే నీచమైన స్థాయికి దిగజారిందని మండిపడ్డారు. పక్కా ఇళ్లు కట్టుకుని కోట్లు గడిస్తున్న కబ్జాదారులను వదిలేసి, పేదవాడి పూరిగుడిసెపై ప్రతాపం చూపించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు మైనార్టీలను, పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని వారు విమర్శించారు.

ఎన్నికల సమయంలో ముస్లింలు, పేదల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసే నాయకులు, నేడు అదే ముస్లిం, మైనార్టీ పేదలకు చెందిన ఇళ్లను కనికరం లేకుండా కూల్చివేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత వారిని వీధిన పడేయడం దారుణమన్నారు. పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. చివరగా, ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు బీజేపీ నేతలు సవాల్ విసిరారు. దమ్ముంటే, ఏ పాపం ఎరుగని పేదల ఇళ్లు కూల్చడం ఆపి, 1954 నాటి ‘పహాణీ’ (భూ రికార్డులు) ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఆ 62 ఎకరాల భూములు ఎవరివి? ఎవరి కోసం ఇచ్చారో రికార్డులు బయటపెడితే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. తక్షణమే ఈ కూల్చివేతలు ఆపి, నిరాశ్రయులైన పేదలకు అదే స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ప్రజా ఉద్యమం చేపడతామని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, మందడప సుబ్బారావు, నకిరికంటి వీరభద్రం, వీరవెల్లి రాజేష్,రవి రాథోడ్, రవి గౌడ్, శాసనాల సాయిరాం, మందా సరస్వతి, రుద్రగని మాధవ్, పిల్లల మరి వెంకట్, పాలెపు రాము, నలమాస్ శ్రీనివాస్, వల్లాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply