Urology PG Seats ఎస్ ఎంసీలో రెండు యూరాలజీ సీట్లు Andhra Prabha News

Urology PG Seats ఎస్ ఎంసీలో రెండు యూరాలజీ సీట్లు Andhra Prabha News
జాతీయ వైద్య కమిషన్ ఆమోదం
ప్రాంతీయ ఆరోగ్య రంగానికి కీలక మైలురాయి
నైపుణ్య వైద్యుల తయారీలో ముందడుగు
అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్ అభినందనలు
( ఆంధ్రప్రభ విజయవాడ)
ఏపీ ప్రజలకు ఉన్నత వైద్య సేవలు, నైపుణ్య వైద్యుల తయారీకి ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో యూరాలజీ విభాగంలో సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సు ప్రారంభానికి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి లభించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంనుంచి ఈ కోర్సుకు రెండు సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు మంజూరు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. యేడుకొండలరావు తెలిపారు.
యూరాలజీ అంటే మూత్రపిండాలు, మూత్ర మార్గం, పురుష వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వైద్య విభాగం. ఈ విభాగంలో ఉన్నత స్థాయి వైద్య విద్య ప్రారంభం కావడం కళాశాలకు మాత్రమే కాకుండా ప్రాంతీయ ఆరోగ్య రంగానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా యూరాలజీ విభాగం అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ఆధునిక సదుపాయాల ఏర్పాటుతో ఈ గుర్తింపు సాధ్యమైందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా యూరాలజీ విభాగాధిపతి డా. శ్రీధర్‌తో పాటు విభాగంలోని అధ్యాపక సిబ్బందిని ప్రిన్సిపాల్ అభినందించారు. అలాగే వైస్ ప్రిన్సిపల్స్ డా. ప్రశాంతి, డా. గోవింద్, డా. ప్రభాకర్ తదితరులు కూడా కళాశాల యాజమాన్యానికి, యూరాలజీ విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ అనుమతి ద్వారా కళాశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య బలోపేతం అవుతుందని, భవిష్యత్తులో నైపుణ్య వైద్యులు తయారై రాష్ట్ర ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.
