Solar | పల్నాడు జిల్లాలో ‘సౌర’ ప్రభ

Solar | పల్నాడు జిల్లాలో ‘సౌర’ ప్రభ
పీఎం సూర్య ఘర్ పథకానికి జిల్లాలో భారీ స్పందన.. 72 వేల దరఖాస్తులు
గిరిజన తండాల్లో ‘వంద శాతం సోలార్’ లక్ష్యం.. ఎస్.ఇ విజయ్ కుమార్
Solar | పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ: ఒకప్పుడు పల్నాడు అంటే విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలు, కాలిన మోటార్ల కథలే వినిపించేవి. కానీ నేడు సీన్ మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న “ప్రధానమంత్రి సూర్య ఘర్” యోజన పథకం పల్నాడు గ్రామీణ ముఖచిత్రాన్ని మారుస్తుంది. 2026 నాటికి జిల్లాలో గ్రిడ్ విద్యుత్‌తో పాటు సోలార్ ఎనర్జీ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది.
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు వేగవంతం కావడంతో పల్నాడు పల్లెలు సౌర కాంతులతో సిద్ధమవుతున్నాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 72,000 దరఖాస్తులు అందినట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్.ఇ ప్రత్తిపాటి విజయ్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 5.43 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో వ్యవసాయ కనెక్షన్లు: 98,000 ,గృహ, వ్యాపార కనెక్షన్లు సుమారు 4 లక్షలు.ఈ భారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రిడ్ పై భారం తగ్గించేందుకు పీఎం సూర్య ఘర్ పథకం ఒక సంజీవనిలా మారింది.
గిరిజన పల్లెల్లో ‘సౌర’ విప్లవం
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు పల్నాడులోని గిరిజన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గిరిజన గ్రామాన్ని ఎంపిక చేసి, అక్కడ ఉన్న అన్ని గృహాలకు వంద శాతం సోలార్ ప్యానెళ్లు అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు కొన్ని తండాలను ఎంపిక చేశారు. నాగేశ్వరపురం (మాచవరం), అచ్చమ్మ కుంట (మాచర్ల), చాకలికుంట (రొంపిచర్ల), గింజుపల్లి (అచ్చంపేట), శివాపురం (నకరికల్లు), మరియు గంగుపల్లి తండా (బొల్లాపల్లి). రానున్న 15 రోజుల్లో ఈ 6 తండాల్లోని 1660 గృహాలకు సౌర ఫలకల ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
లక్ష్యం ఘనం.. సాధించిన ప్రగతి ఇదే…
ప్రధానమంత్రి సూర్య ఘర్” యోజన పథకానికి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 72,000 దరఖాస్తులు అందాయి. ఇందులో గమనార్హమైన విషయం ఏమిటంటే.. బలహీన వర్గాల నుంచి భారీగా స్పందన రావడం. అందిన మొత్తం దరఖాస్తుల్లో 27,000 దరఖాస్తులు కేవలం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుంచే వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో 3,200 గృహాలకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో ఈ ప్యానెళ్లను అందిస్తోంది. దీనివల్ల నిరుపేద కుటుంబాలకు నెలకు వచ్చే కరెంటు బిల్లుల భారం పూర్తిగా తప్పుతుంది.
పగటిపూట సూర్యుడి నుంచి వచ్చే శక్తితో ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, టీవీలు నడుపుకోవడమే కాకుండా, మిగిలిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌కు పంపడం ద్వారా లబ్ధిదారులకు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.3 కిలోవాట్ల వరకు ఏర్పాటు చేసుకున్న వారికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. దీనివల్ల సామాన్య కుటుంబాలకు నెలకు రూ.1,500 నుండి రూ.2,500 వరకు కరెంట్ బిల్లు తప్పుతోంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ ల గృహాలకు ప్రభుత్వం అందిస్తున్న 100శాతం సబ్సిడీ/ ఉచిత సోలార్ సిస్టమ్‌లు జిల్లాలోని పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. జిల్లాలోని మెజారిటీ అగ్రికల్చర్ ఫీడర్లను సోలారైజేషన్ చేయడం ద్వారా రైతులకు పగటిపూట నిరంతర సరఫరా అందనుంది. సంప్రదాయ మోటార్ల స్థానంలో సోలార్ పంపు సెట్లను అమర్చుకున్న రైతులు, కరెంట్ సరఫరా కోసం వేచి చూసే అవసరం లేకుండానే పొలాలకు నీరు పెడుతున్నారు.
క్షేత్రస్థాయిలో సవాళ్లు …
ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహిస్తున్నా, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు, అధికారులు కొన్ని సాంకేతిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.సోలార్ ప్యానెళ్లు అమర్చిన తర్వాత వాటిపై దుమ్ము పేరుకుపోతే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. పీఎం సూర్య ఘర్ పథకం విజయవంతం కావాలంటే ‘నెట్ మీటరింగ్’ వ్యవస్థ పక్కాగా ఉండాలి. కొన్ని మారుమూల గ్రామాల్లో పాత ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం సోలార్ విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపే స్థాయిలో లేదు. దీనివల్ల లబ్ధిదారులు తాము ఉత్పత్తి చేసిన అదనపు విద్యుత్‌ను విక్రయించలేకపోతున్నారు. లైన్ మెన్లు, స్థానిక విద్యుత్ సిబ్బందికి సోలార్ ఇన్వర్టర్ల పనితీరుపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం వల్ల, చిన్న రిపేర్లు వచ్చినా లబ్ధిదారులు ప్రైవేట్ మెకానిక్కుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. సాధారణ వర్గాల వారికి సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా లోన్ రూపంలో ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.
పల్నాడులోని చిన్న రైతులు లేదా తక్కువ ఆదాయం ఉన్న గృహస్థులకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాయి. వ్యవసాయ ఫీడర్లను సోలారైజేషన్ చేస్తున్నప్పుడు, మోటార్ల హెచ్‌పీ సామర్థ్యం కంటే సోలార్ ఉత్పత్తి తక్కువగా ఉంటే పంప్ సెట్లు సక్రమంగా పనిచేయడం లేదు. పల్నాడులో భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారీ మోటార్లు వాడతారు. వాటికి సరిపడా సోలార్ సామర్థ్యం లేకపోతే పగటిపూట కూడా నీటి సరఫరా అందడం లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు.ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై గ్రామీణులకు ఇంకా స్పష్టత అవసరం.
ప్రధానమంత్రి సూర్య ఘర్” యోజన పథకం అపూర్వ ఆదరణ: ఎస్ఈ విజయ్ కుమార్
పల్నాడు జిల్లాలో “ప్రధానమంత్రి సూర్య ఘర్” యోజన పథకం కు లబ్ధిదారుల నుండి 72,000 దరఖాస్తులు అందినట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్. ఇ ప్రత్తిపాటి విజయ్ కుమార్ వెల్లడించారు. తమకు అందిన దరఖాస్తుల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవి 27 వేల దరఖాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 3,200 గృహాలకు ఈ పథకం కింద అమర్చడం జరిగిందని వివరించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి ఒక గిరిజన గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఈ సూర్యగర్ పథకం కింద పూర్తిస్థాయిలో అన్ని గృహాలకు సౌర పలకలు అమర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పక్షం రోజుల్లో గా ఆరు గిరిజన తండాలలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. మొత్తం 1660 గృహాలకు ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు నూటికి నూరు శాతం సబ్సిడీతో సౌర పలకలు అమర్చడం జరుగుతుందని తెలియజేశారు.


