IOA | అత్యున్నత గౌరవం..

IOA | అత్యున్నత గౌరవం..
- స్పైన్ సర్జన్ డాక్టర్ నరేష్ బాబుకు గోల్డెన్ జూబ్లీ ఒరేషన్ అవార్డు
- మల్లిక స్పైన్ సెంటర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు
IOA | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గుంటూరులోని మల్లిక స్పైన్ సెంటర్ చీఫ్ ఆఫ్ స్పైన్ సర్వీసెస్ డా. జె. నరేష్ బాబు, ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ (IOA) నిర్వహించిన 70వ వార్షిక జాతీయ సదస్సులో అత్యున్నత గౌరవంగా భావించే గోల్డెన్ జూబిలీ ఒరేషన్ అవార్డు – 2025ను గెలుచుకున్నారు. ఈ అవార్డుతో పాటు మరో రెండు ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్స్ కూడా ఆయన ఖాతాలో చేరడంతో, మొత్తం మూడు జాతీయ అవార్డులు సాధించిన ఘనత ఆయనకు దక్కింది. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది.
ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును, సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల నరాలపై పడే ఒత్తిడిపై డా. నరేష్ బాబు చేసిన ఒరిజినల్, ఇప్పటివరకు ప్రచురితం కాని పరిశోధనకు గాను ప్రదానం చేశారు. ఈ పరిశోధనను ప్రతిష్టాత్మక ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేకంగా, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పరిశోధనకు ఈ అవార్డు లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సమావేశానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉత్తమ స్పైన్ పరిశోధనకు గోల్డ్ మెడల్ – 2024
ఇదే సదస్సులో భాగంగా, వెన్నునొప్పితో బాధపడే రోగులలో ఎవరికెప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ సరైనదన్న అంశంపై చేసిన పరిశోధనకు గాను డా. నరేష్ బాబుకు హెచ్‌కే టీ రజా గోల్డ్ మెడల్ – 2024 లభించింది. ఈ అవార్డును గువాహటిలోని సారుసజాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ల సమక్షంలో అందజేశారు.
లంబార్ డిస్క్‌పై పరిశోధనకు గోల్డ్ మెడల్ – 2025
అదేవిధంగా, రోజువారీ జీవన శైలీ కార్యకలాపాలు నడుము డిస్క్ ఆరోగ్యంపై చూపే ప్రభావంపై నిర్వహించిన అధ్యయనానికి గాను డా. నరేష్ బాబుకు ఎస్.పీ. మండల్ గోల్డ్ మెడల్ – 2025 వరించింది. 100 లంబార్ డిస్కులపై డైనమిక్ ఎంఆర్ఐ ఆధారంగా చేసిన ఈ పరిశోధన, డిస్క్ అరుగుదలపై శాస్త్రీయ ఆధారాలను స్పష్టంగా వివరించింది. ఈ అవార్డును వచ్చే ఏడాది అహ్మదాబాద్‌లో జరిగే IOA జాతీయ సదస్సులో అధికారికంగా ప్రదానం చేయనున్నారు.
జాతీయ నిపుణుల ప్రశంసలు
డా. నరేష్ బాబు పరిశోధనలు రోజువారీ వెన్ను సమస్యల మూలాలను గుర్తించి, ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతల ద్వారా సమర్థవంతమైన చికిత్స మార్గాలను సూచిస్తున్నాయని జాతీయ స్థాయి సీనియర్ ఆర్థోపెడిక్ నిపుణులు ప్రశంసించారు. ఈ మూడు జాతీయ అవార్డులు డా. నరేష్ బాబు వ్యక్తిగత ప్రతిభకు నిదర్శనంగా నిలవడమే కాకుండా, గుంటూరులోని మల్లిక స్పైన్ సెంటర్ జాతీయ స్థాయిలో ప్రముఖ వెన్నెముక చికిత్సా కేంద్రంగా గుర్తింపు పొందడం గర్వకారణమని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
