Honor | మున్సిపల్ నూతన పాలకవర్గంకు సన్మానం

Honor | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీలకు కేటాయించినట్లుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ను ఎమ్మెల్యే అభినందిస్తూ శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ గా మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ (పద్మశాలి) లను, చండూరు చైర్మన్ గా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ గా రజక సామాజిక వర్గానికి చెందిన భూతరాజు దశరథను కౌన్సిల్ సభ్యుల సహకారంతో నియమించినట్లుగా తెలిపారు.
రాహుల్ గాంధీ బడుగు, బలహీన వర్గాలకు సమన్యాయం చేసే విధంగా దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న దాన్ని తాను మునుగోడు నియోజకవర్గంలో చేసి చూపించానన్నారు. చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో ఎక్కువగా గౌడ్, పద్మశాలి కులస్తులు ఉండడంతో కౌన్సిలర్ల మెజార్టీ మేరకు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను యువకులకు అప్పగించానని, దీనిలో రెడ్డి సామాజిక వర్గం తప్పుగా అర్థం చేసుకోవద్దని తెలిపారు. నన్ను నమ్ముకొని పార్టీలోకి వచ్చిన వ్యక్తి బత్తుల వాణి విప్లవ్ అని, వారు కూడా చైర్మన్ పదవికి అర్హులేనని, కానీ మొగుదాల రమేష్ సుమారు 20 సంవత్సరాలుగా నా వెంటే ఉండి కొన్నిసార్లు టికెట్ కోల్పోయినప్పటికీ పార్టీ కోసం పని చేశాడని అందువల్లనే చైర్మన్ గా ప్రకటించాను.
విప్లవ్ యువకుడు భవిష్యత్తులో అవకాశాలుంటాయి, వారికి కూడా ఎల్లప్పుడూ నా సపోర్ట్ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండడంతో, రానున్న రోజుల్లో జనాభా పెరుగుతుందని, దానికి తగిన మౌళిక వసతులు అందజేస్తామని తెలిపారు. 17వ వార్డు ఏకగ్రీవం జరిగింది, దీనిలో గంగారాములు ఎక్కడ డబ్బుల ప్రస్తావన తేలేదు, నా మాటపై గౌరవంతో కో ఆప్షన్ ఇస్తా అంటే అతను నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాడని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అందులో వాస్తవం లేదని ఎమ్మెల్యే ఖండించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ తో పాటు కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పల్లె లావణ్య సురేష్ రెడ్డి, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్ను లను ఎమ్మెల్యే సన్మానించారు.
