అభివృద్ధే ఆశయం.. సంక్షేమమే సంకల్పం

అభివృద్ధే ఆశయం.. సంక్షేమమే సంకల్పం

2వ వార్డులో నిచ్చకోల వంశీకృష్ణ ప్రచార హోరు!

బెల్లంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నిచ్చకోల వంశీకృష్ణ నిర్వహిస్తున్న ప్రచార పర్వం పట్టణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ‘అభివృద్ది నా ఆశయం – సంక్షేమమే నా సంకల్పం’ అనే నినాదంతో ఆయన వార్డులో ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఆదివారం వార్డులోని ప్రతి గల్లీలో ఇంటింటికీ తిరుగుతూ, ఓటర్లతో నేరుగా చర్చలు జరుపుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తన ఎన్నికల గుర్తు అయిన ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. వార్డులో ఏళ్ల తరబడి నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వార్డులోని అన్ని వీధుల్లో నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, అధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. పారదర్శకమైన పాలన అందిస్తూ, వార్డు రూపురేఖలను మార్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన ఓటర్లకు భరోసా ఇచ్చారు. అభివృద్ధి, మౌలిక వసతులపై ఆయన ఇస్తున్న పక్కా హామీలకు ఓటర్ల నుండి విశేష స్పందన లభిస్తోంది. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని వంశీకృష్ణ విన్నవించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డులోని యువకులు, మద్దతుదారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వంశీకృష్ణకు తమ మద్దతు తెలిపారు.

Leave a Reply