Facilities | పోలీసుల పైరవీలతో దర్శనాలు…

Facilities | పోలీసుల పైరవీలతో దర్శనాలు…
- గుట్ట పై కానరాని సదుపాయాలు…
- సొమ్మసిల్లి పడిపోయిన భక్తులు…
- పోలీసుల కుటుంబాలకే దర్శనమా…?
Facilities | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కీసర గుట్ట పై వెలిసిన శ్రీరామలింగేశ్వర స్వామి సాక్షిగా స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు నానా అవస్థలతో పడరాని పాట్లు పడ్డారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా కీసర గుట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎక్కడా అమలు కాలేదు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మరీ చెప్పాలంటే దర్శనానికి వచ్చే భక్తులను పక్కన పెట్టి పోలీసుశాఖ తమతమకు సంబంధించిన వారికి మాత్రమే దగ్గరుండి వీఐపీ దర్శనాలు చేయించారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Facilities | పోలీసుల పైరవీలతో దర్శనాలు…
గుట్ట కింది నుంచి మొదలుకొని స్వామి వారి దర్శనం వరకు పోలీసులు పైరవీలు చేసి మరీ కొంతమందిని అనుమతించి దర్శనానికి లోపలికి పంపించడంతో భక్తులు పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఓ అధికారి లేదు లేదు డీసీపీ సార్ చెప్పారు ఎవరిని అనుమతించ వద్దని చెప్పుకుంటూనే లోలోపల అమ్యామ్యాలతో తెగ పైరవీలు చేసి మరీ సహకరించారని భక్తులు ఆరోపించారు. వీఐపీ క్యూ లైన్ వద్ద విధులు నిర్వహించే పోలీసులు కొందరు దేవుడి ముంగిట కొట్టే కొబ్బరి కాయ కోసం భక్తులు కొట్టు వారితో భేరసరాలు ఆడినట్టు ఆడరాని తెగ సెటైర్లు వేసుకున్నారు.
Facilities | గుట్ట పై కానరాని సదుపాయాలు…
కీసర గుట్ట పై స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అధికారులు ఏ మాత్రం సదుపాయాలు ఏర్పాటు చెయ్యలేదు. తాగేందుకు త్రాగు నీరు లేకపోవడంతో గంటల కొద్దీ క్యూ లైన్‌లో బారులు తీరిన భక్తులు కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. గుట్ట పై కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన అధికార యంత్రాంగం పై భక్తులు ధ్వజమెత్తారు. ఎంతసేపు తమ శాఖలకే కొమ్ము కాశారని భక్తుల గురించి పట్టించుకోలేదని ముఖ్యంగా పోలీసుశాఖ వ్యవహరించిన తీరు పై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. కేవలం దేవుడి దగ్గర మాత్రమే బేధాలు ఉండవని అనుకున్నారు భక్తులు. కానీ పోలీసులు చేసిన నిర్వాకం తీరు పై తేడా కొట్టొచ్చినట్లు కనపడింది. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన అధికారులు, భక్తుల పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
