26th Ward | గులాబీ గూటికి ముగ్గురు కౌన్సిలర్లు…

26th Ward | గులాబీ గూటికి ముగ్గురు కౌన్సిలర్లు…

  • బెల్లంపల్లిలో మారుతున్న రాజకీయ గాలులు

26th Ward | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. పట్టణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ముగ్గురు కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ సుకేసిని భరద్వరాజ్, అలాగే బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి కొక్కుల రామమూర్తితో పాటు మాజీ కౌన్సిలర్ శంకర్ సింగ్ కూడా అధికారికంగా బీఆర్ఎస్‌లో చేరారు.

పార్టీ విధానాలు, అభివృద్ధి దిశకు ఆకర్షితులై తాము గులాబీ గూటిలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బెల్లంపల్లి అభివృద్ధే లక్ష్యంగా, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని భరోసా ఇచ్చారు. తాజా చేరికలతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ బలం పూర్తిగా మారిపోయింది.

నిన్నటి వరకు కాంగ్రెస్‌కు 13 మంది కౌన్సిలర్లు + 4 స్వతంత్రులు = బలం 17గా ఉండగా, మరోవైపు బీఆర్ఎస్‌కు 14 మంది కౌన్సిలర్లు + తాజాగా చేరిన ముగ్గురు కౌన్సిలర్లు = బలం 17గా సమాన స్థాయికి చేరుకుంది. దీంతో మున్సిపాలిటీలో అధికార సమీకరణాలు తారుమారు కావడంతో పాటు, చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది? అనే ఉత్కంఠ పట్టణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

గులాబీ శిబిరం ఒక్కసారిగా బలోపేతం కావడంతో బెల్లంపల్లి రాజకీయాలు హీటెక్కాయి. అధికార కాంగ్రెస్‌కు ఇది రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా మారగా, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో అధికారం కోసం జరిగే రాజకీయ ఎత్తుగడలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Leave a Reply