Jannaaram | గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్ఐ మృతి..

జన్నారం,ఫిబ్రవరి 4( ఆంధ్రప్రభ) మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ అదనపు ఎస్సై రాథోడ్ తానాజీనాయక్ (60) మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు గుండెపోటుతో మృతి చెందారు.మృతుడు 10 నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు.

పోలీస్ స్టేషన్లోని క్వాటర్ లో నివాసముంటున్న తానాజీ తెల్లవారుజామున చాతి నొప్పి వస్తుందని హోంగార్డు బ్రహ్మకు ఫోన్ చేసి చెప్పారు.

స్టేషన్ హౌస్ ఆఫీసరైన ఎస్సై రాజవర్ధన్ సూచనతో బ్రహ్మం,ఎఎస్ఐ బిక్లాల్ లు స్థానిక లలిత హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు.చికిత్స పొందుతూ ఉండగా చనిపోయినట్లు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ ఉదయం తెలిపారు.

మృతుడు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం ఎందా వాసి.1983 సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి, హెడ్ కానిస్టేబుల్,ఎఎస్ఐ,ఆరేళ్ల క్రితం ఎస్సైగా ప్రమోషన్ పొంది,విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం జన్నారం పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్ఐగా పనిచేస్తున్నారు. వచ్చే నవంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు.మృతునికి భార్య పుష్పలతతో పాటు వివాహమైన ఇద్దరు అమర్,వినాయక్ కుమారులు ఉన్నారు.పెద్ద కుమారుడు ఉమ్మడి జిల్లా లింగాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దినసరి హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు.చిన్న కుమారుడు వినాయక్ ఎండి వైద్యులుగా పనిచేస్తున్నారు.

మృతుడు మండలంలోని ఇందనపల్లిలో ఓ ఇల్లు నిర్మించుకున్నారు. తానాజీ అందరితో నోట్లో నాలుకలాగా మెలుగుతూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడని పలువురు పోలీసులు,మిత్రులు తెలిపారు. మృతదేహం వద్ద భార్య, కుటుంబ సభ్యులు,పోలీసులు,బంధువులు కన్నీరు మున్నీరుగా వినిపించారు.మృతుని అంత్యక్రియలు ఉట్నూరులో సాయంత్రం చేనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *