MLA | రాజకీయ హీట్ పెంచిన ఉషశ్రీ చరణ్…

MLA | రాజకీయ హీట్ పెంచిన ఉషశ్రీ చరణ్…
MLA | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పెనుకొండ దర్గా సర్కిల్ రాజకీయ సందడి మధ్య మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్ నిర్వహించిన “కాఫీ విత్ క్యాడర్” కార్యక్రమం హై వోల్టేజ్ రాజకీయ వాతావరణాన్ని సృష్టించింది. శనివారం ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ పార్టీ బలం పెంచే దిశగా ఆమె చురుకుగా ముందుకెళ్లారు.
పెనుకొండ మునిసిపాలిటీ 06, 7వ వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆమె, జగనన్న ప్రభుత్వం కాలంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమం చేరిందని పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేస్తూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
రైతు భరోసా, పంట బీమా వంటి పథకాలతో రైతులకు బలమైన అండగా నిలిచిన ప్రభుత్వం జగనన్నదేనని పేర్కొన్న ఆమె, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా హామీలు నెరవేర్చడంలో విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమంలో భాగంగా వార్డు కమిటీ సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. పెనుకొండ మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కోనాపురం గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
