Schedule | 20 నుంచి ఆర్టీఈ ప్రవేశాలు..

Schedule | 20 నుంచి ఆర్టీఈ ప్రవేశాలు..
- పేద పిల్లలకు ఉచిత ప్రైవేటు విద్య
- 25% ఉచిత కోటా నిరుపేద కుటుంబాలకి..
- ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఆన్‌లైన్, సచివాలయాల ద్వారా నమోదు
- మార్చి 25న తొలి విడత సీట్ల కేటాయింపు
- ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అందుబాటులో 48 సీట్లు..
Schedule | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ధనిక,పేద తేడా లేకుండా ప్రతి పిల్లాడికి సమాన అవకాశం కల్పించాలనే లక్ష్యంతో అమలులో ఉన్న విద్యా హక్కు చట్టం మరోసారి వేలాది కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం నిరుపేద వర్గాలకు చెందిన వారికి ఉచిత కోటా సీట్లకు ఈ నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ సౌకర్యం లేని వారు గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రాలు, సంబంధిత ప్రైవేటు పాఠశాలల ద్వారా కూడా దరఖాస్తును అందజేయవచ్చు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలతో పాటు విజయవాడ అర్బన్ రూరల్ పరిధిలో విద్యాహక్కు చట్టం కింద మొత్తం 48 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నిరుపేదలకు చక్కటి అవకాశం..
విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలలు తమ సీట్లలో 25 శాతం కోటాను ఆర్థికంగా వెనుకబడిన, సామాజికంగా బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలి. ఈ కోటాలో చేరిన విద్యార్థులకు స్కూల్ ఫీజులను ప్రభుత్వం భరిస్తుంది. ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాం, ఇతర మౌలిక సదుపాయాలు కూడా నిబంధనల ప్రకారం అందిస్తారు. అంటే లక్షల రూపాయలు ఖర్చయ్యే ప్రైవేటు విద్య పేద పిల్లలకు పూర్తిగా ఉచితం గా అందనుంది.
అర్హులు వీరే..
విద్యాహక్కు చట్టం ద్వారా ప్రధానంగా పేద కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అనాథలు, కార్మిక కుటుంబాల పిల్లల కోసం ఉద్దేశించబడింది. ఆదాయ పరిమితి, నివాస ప్రాంతం, సామాజిక స్థితి ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు. సీబీఎస్సీ ఐసిఎస్సి ఐబి పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31 మధ్య పుట్టిన పిల్లలు కనీసం ఐదేళ్లు నిండి ఉండాలి. రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య పుట్టిన చిన్నారులకు అవకాశం కల్పించనున్నారు. దరఖాస్తు సమయంలో తల్లిదండ్రుల వారి ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, రేషన్ కార్డు, భూమి హక్కుల పత్రం లేదా ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్తు బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పిల్లల జనన ధ్రువపత్రం, ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హతను ధ్రువీకరిస్తారు. ఫిబ్రవరి 7–16:ప్రైవేటు పాఠశాలలు తమ వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయగా, ఫిబ్రవరి 20 – మార్చి 10 విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మార్చి 17 సచివాలయాల డేటాతో అర్హత నిర్ధారణ క్షేత్రస్థాయిలో కూడా చేస్తారు. మార్చి 25 న మొదటి విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తుండగా, మార్చి 26 ఏప్రిల్ 7 ప్రవేశాలను అనుమతిస్తారు. ఏప్రిల్ 12న రెండో విడత సీట్ల కేటాయింపు చేస్తుండగా, ఏప్రిల్ 13 – 23 మధ్య తుది ధ్రువీకరణ, పాఠశాలల్లో చేరిక ను అధికారులు నిర్వహించనున్నారు. దరఖాస్తులపై సందేహాలుంటే తల్లిదండ్రులు 1800 425 8599 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇలా..
విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అందుబాటులో 48 సీట్లు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏ కొండూరు ఇబ్రహీంపట్నం జగ్గయ్యపేట కంచికచర్ల నందిగామ పెనుగంచిప్రోలు రెడ్డిగూడెం వీరులపాడు విజయవాడ రూరల్ విజయవాడ అర్బన్ వంటి ప్రాంతాలలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 48 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ కొండూరులో రెండు ఇబ్రహీంపట్నంలో రెండు జగ్గయ్యపేటలో ఒకటి కంచికచర్లలో మూడు నందిగామలో రెండు పెనుగంచిప్రోలు రెండు రెడ్డిగూడెంలో నాలుగు వీర్లపాడులో ఒకటి విజయవాడ రూరల్ పరిధిలో రెండు విజయవాడ అర్బన్ పరిధిలో 29 సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 48 సీట్లకు గాను 38 సీట్లు విద్యాహక్కు చట్టం ద్వారా నిరుపేదలకు కల్పించినప్పటికీ ఇంకా 10 సీట్లు మిగిలిపోయినట్లు ఇందులో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం 1 నందిగామ ఒకటి రెడ్డిగూడెం ఒకటి విజయవాడ అర్బన్ పరిధిలో 10 సీట్లు మిగిలినట్లు అధికారులు చెబుతున్నారు.
