మార్గదర్శులకు అన్నదాతలయ్యే అవకాశం..

మార్గదర్శులకు అన్నదాతలయ్యే అవకాశం..
శుభ కార్యాల సందర్భంగా మంచి మనసును చాటుకోండి
పట్టెడన్నం పెట్టి పేదల ఆకలి తీర్చడంలో భాగస్వాములుకండి
అన్నా క్యాంటీన్లకు విరాళాలతో చేయూతనివ్వండి
ముఖ్యమంత్రి దంపతుల స్ఫూర్తితో ముందుకురండి
ఒక అన్నా క్యాంటీన్ లో రోజుకయ్యే ఖర్చు రూ. 29,800
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : అన్నార్తులకు పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చడంలో మార్గదర్శులకు గొప్ప అవకాశం అందిస్తున్నామని.. ప్రతిఒక్కరూ వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలు సందర్భంగా అన్నా క్యాంటీన్‌కు విరాళం అందించి మంచి మనసు చాటుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టర్ లక్ష్మీశ తిరువూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలతో కలిసి భోజనం చేశారు.

ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లు, మరుగుదొడ్లు తదితరాలను పరిశీలించారు. ఆహారాన్ని రుచిచూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి అన్నా క్యాంటీన్‌పై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు రూ. 76 లక్షలు విరాళమిచ్చి..

రాష్ట్రమంతా ఒకరోజు ఉచితంగా పేదలకు భోజనం అందించారని.. సీఎం దంపతులను స్ఫూర్తిగా తీసుకొని పీ4 కింద అన్నా క్యాంటీన్‌కు చేయూత నందించి ఆకలి లేని సమాజానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. తమ పుట్టినరోజు, పెళ్లిరోజు, పిల్లల పుట్టినరోజు, తల్లిదండ్రుల పుట్టినరోజు ఇలా ఏ శుభ సందర్భాన్ని పురస్కరించుకొనైనా విరాళాలు అందించాలని కోరారు. అన్నదానం చేసినప్పుడు కలిగినప్పుడు కలిగే సంతృప్తి వెలకట్టలేనిదని కలెక్టర్ పేర్కొన్నారు.

శుభకార్యాల సందర్భంగా బంధువులు, స్నేహితులను ఆహ్వానించి లక్షల రూపాయల ఖర్చుతో విందు ఏర్పాటు చేస్తామని.. ఈ సందర్భంగానే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది పేదల ఆకలి తీర్చే అవకాశం సొంతమవుతుందని.. ఆకలి తీర్చుకున్న అన్నార్తులు సంతోషంతో అందించే దీవెనలు ఆ కుటుంబ శ్రేయస్సుకు దోహదం చేస్తాయన్నారు. దీన్ని గుర్తించి ప్రతిఒక్కరూ శుభకార్యాల సందర్భంగా అన్నా క్యాంటీన్‌కు వారి స్తోమత మేరకు విరాళాలు అందించి, సమాజంలో ఆదర్శవంతులుగా నిలవాలన్నారు.
ఒక రోజుకు రూ. 29,800..
ఒక అన్నా క్యాంటీన్‌కు అల్పహారానికి రూ. 7,700, మధ్యాహ్న భోజనానికి రూ. 13,600, రాత్రి భోజనానికి రూ. 8,500 ఖర్చవుతుందని.. అంటే రోజుకు రూ. 29,800 ఖర్చవుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. మార్గదర్శులు ఒక రోజు లేదా ఒక వారం లేదా ఒక నెల లేదా వీలైనన్ని రోజులకు విరాళాలు అందించవచ్చన్నారు. లేదంటే అన్నా క్యాంటీన్ మొత్తాన్ని దత్తత తీసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15 అన్నా క్యాంటీన్లు ఉన్నాయని.. వీటిపై నిరంతర పర్యవేక్షణతో పేదలకు సేవలందించడంలో రాజీపడకుండా చూస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
