AP | క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా ఆర్చరీ టోర్నమెంట్..
AP | క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా ఆర్చరీ టోర్నమెంట్..
AP, విజయవాడ, ఆంధ్రప్రభ : ఖేలో ఇండియా–ఎన్‌టీపీసీ అమరావతి సిటీ ఓపెన్ ఆర్చరీ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ (ఐజీఎంసీ) స్టేడియంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికి పైగా విలువిద్యాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్ విభాగాల్లో జరిగిన పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. యువతీ యువకులు క్రీడాస్ఫూర్తితో పాల్గొని అద్భుత ప్రదర్శన చేయడంతో టోర్నమెంట్ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ఈ పోటీలను ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ (ఏపీఏఏ), కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ (కేడీఏఏ) మరియు ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి.
టోర్నమెంట్ ముగింపు సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ బీవీ వెంకటరమణ, ట్రెజరర్ చెరుకూరి కృష్ణకుమార్, వైస్ ప్రెసిడెంట్ రొమ్మడేవర శ్రావణ్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. కోచ్‌లు నవీన్ కుమార్, కె.వంశీ కృష్ణ, విజయ్ భరద్వాజ్, వైఎం జయలక్ష్మి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ రాష్ట్రంలో విలువిద్యకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉందని, యువతలో క్రీడాప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఇలాంటి వేదికల నుంచే తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ఆర్చరీ టోర్నమెంట్ ద్వారా అమరావతి నగరం మరోసారి క్రీడా కేంద్రంగా గుర్తింపు పొందిందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి.
