T20 match | విజయంతో ముగిస్తారా..?

విజయంతో ముగిస్తారా..?
- నేడు భారత్, కివీస్ ఐదో టీ20
- కేరళలోని తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో..
- రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం
T20 match | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు చిట్టచివరి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐదవ టి20 మ్యాచ్ నిర్వహించనున్నారు. కేరళ లోని తిరువనంతపురం వేదికగా గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఈ ఐదవ టి20 మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ రాత్రి 7గంటలకు ఆరంభం అవుతుంది.
హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు నాలుగో టీ20లో న్యూజిలాండ్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 50 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఇవాళ జరగనున్న ఐదో టీ20 మ్యాచ్‌ను భారత్ ఎలాగైన గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరల్డ్‌కప్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తోంది. అందుకే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంది.
సత్తా చాటుతున్న బ్యాటర్లు
అలాగే గత మ్యాచ్ కు దూరమైన ఇషాన్ కిషన్ తుది జట్టులోకి రానున్నాడు. ఇషాన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్ తో ఫామ్ అందుకున్నారు. దీంతో మెగాటోర్నీకి ముందు చాలా వరకూ భారత్ టెన్షన్ లు తీరినట్టే. అటు హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్ కూడా సత్తా చాటుతున్నారు. అదే సమయంలో శివమ్ దూబే నాలుగో టీ ట్వంటీలో విధ్వంకర ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి తన స్టామినా ఏంటో చాటి చెప్పాడు. దూబే ఫినిషర్ రోల్ లో కీలకం కాబోతున్నాడు.
బౌలింగ్‌లో నిలకడలేమి..
మరోవైపు బౌలింగ్ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు నెలకొన్నాయి. బుమ్రా పర్వాలేదనిపిస్తున్నా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా నిలకడగా రాణించడం లేదు. అర్షదీప్ తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. అటు హర్షిత్ రాణా వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పేసర్లు సమిష్టిగా రాణించేందుకు ఈ మ్యాచ్ చివరి అవకాశం. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లలో ఇద్దరికే చోటు దక్కుతుంది.
సంజూకు కీలక పరీక్ష
ఈ సిరీస్ ఆరంభం నుంచి సంజూ శాంసన్ ఫామ్ భారత జట్టుకు పెద్ద ఆందోళనగా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లో అయినా అతడు తిరిగి ఫాంలోకి వస్తాడేమో అని అభిమానులు ఆశిస్తున్నారు. చివరి టీ20 అతడి సొంత నగరమైన తిరువనంతపురంలో జరగనుండటంతో, పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు ఇది అతడికి మంచి అవకాశంగా మారింది. అలాగే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబేపై మరోసారి అందరి దృష్టి నిలిచింది. రింకూ సింగ్ మంచి ఫామ్‌లో కొనసాగుతుండగా, గత మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్‌కు చివరి టీ20లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉత్సాహంలో న్యూజిలాండ్
నాలుగో టీ20లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ జట్టు భారత్‌పై విజయం సాధించింది. అదే జోరును కొనసాగించి సిరీస్‌ను గౌరవప్రదంగా ముగించాలని కివీస్ భావిస్తోంది. గత మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధారించారు. ఓపెనర్లు సీఫర్ట్, డెవాన్ కాన్వేతో పాటు మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు. ఈ నలుగురిని కట్టడి చేయగలిగితేనే భారత గెలుపు సాధ్యమవుతుంది. ఆ మ్యాచులో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. ఇవాళ జరిగే మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం ఎలా రాణిస్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, శాంట్నర్‌లు టీమిండియా బ్యాటర్లకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
పిచ్ పరిస్థితులు, రికార్డులు
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. అదే సమయంలో స్పిన్నర్లకూ సహకారం లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో మూడు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తంగా ఈ సిరీస్‌ను విజయంతో ముగించాలంటే చివరి టీ20లో భారత్ జట్టు పూర్తి శక్తితో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జట్ల అంచనా
ఇండియా: ప్రాబబుల్ XI: సంజు సామ్సన్ (wk), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (c), శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్
న్యూజిలాండ్: ప్రాబబుల్ XI: టిమ్ సీఫెర్ట్ (wk), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (c), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ
