Conference | పారిశుధ్య కార్మికుల చేతిలోనే..

Conference | పారిశుధ్య కార్మికుల చేతిలోనే..
- దుర్గ గుడి ఈఓ శీనా నాయక్
Conference | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ అన్నారు. ఆలయ ప్రతిష్ట, భక్తుల అనుభూతి పూర్తిగా పారిశుధ్యంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై మహామండపం ఆరో అంతస్తులో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పారిశుధ్య కార్మికులు, సూపర్వైజర్లు, సంబంధిత విభాగ అధికారులతో ఈఓ ముఖాముఖి చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుడు ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుంచే పరిశుభ్రత అతనికి ప్రశాంతతను ఇవ్వాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలిపారు. పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ… వారు నిర్వహిస్తున్న పని కేవలం శుభ్రపరిచే విధి మాత్రమే కాదని, అది అమ్మవారికి చేసే పవిత్ర సేవగా భావించాలని సూచించారు.
భక్తుల నడకతో పవిత్రమైన ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని, విధుల పట్ల పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడా చెత్తాచెదారం కనిపించకుండా జీరో గార్బేజ్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు, స్నానఘట్టాలు వంటి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

ఆధునిక పారిశుధ్య పరికరాల వినియోగంతో పాటు రసాయనాల వాడకంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్మికుల భద్రత, సంక్షేమంపై కూడా ఈఓ ప్రత్యేక శ్రద్ధ చూపారు. విధుల్లో ఉన్నప్పుడు యూనిఫాం, గ్లౌజులు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. కార్మికులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వారి సంక్షేమానికి దేవస్థానం కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇంద్రకీలాద్రిని రాష్ట్రంలోనే అత్యంత పరిశుభ్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం అని ఇందులో ప్రతి పారిశుధ్య కార్మికుడి పాత్ర కీలకం అని శీనా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సి.హెచ్. రంగారావు మాట్లాడుతూ, ఆలయంలో పారిశుధ్యం ఒక సాధారణ పని కాదని, అది అమ్మవారికి చేసే సేవగా భావించి అంకితభావంతో పనిచేయాలని కార్మికులను కోరారు. విధుల్లో సమయపాలన పాటించాలని, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఈఓ ఎన్. రమేష్ బాబు, పారిశుధ్య విభాగం ఇన్‌స్పెక్టర్లు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
