Shirdi | షిర్డీలో ఉద్యోగుల జాతీయ మ‌హాస‌భ‌లు..

Shirdi | షిర్డీలో ఉద్యోగుల జాతీయ మ‌హాస‌భ‌లు..

  • మహాస‌భ‌ల‌కు త‌ర‌లివెళ్లిన ఏపీ ఎన్‌జీజీవో ప్ర‌తినిధులు..
  • ప్రభుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై స‌మాఖ్య మ‌హాస‌భ‌ల్లో చ‌ర్చిస్తాం..
  • ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీర్మానాలు చేస్తాం..
  • ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్..

Shirdi | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఈ నెల 21 నుంచి 26వ తేదీ వ‌ర‌కు మహారాష్ట్రలోని షిర్డీలో జ‌ర‌గ‌నున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ మహాసభల్లో చ‌ర్చించి తీర్మానాలు రూపొందించి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌మ‌ర్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స‌మాఖ్య జాతీయ ఉపాధ్య‌క్షుడు, ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్య‌క్షుడు ఎ.విద్యాసాగ‌ర్ తెలిపారు.

షిర్డీలో ఈ నెల 21వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మ‌హాస‌భ‌ల్లో పాల్గొనేందుకు ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ఎ.విద్యాసాగ‌ర్‌, డీవీ ర‌మ‌ణ‌ల నేతృత్వంలో దాదాపు 65 మంది ఉద్యోగ సంఘాల నేత‌ల బృందం గురువారం విజ‌య‌వాడ నుంచి షిర్డీకి రైలు మార్గంలో బ‌య‌లుదేరి వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద మీడియా ప్ర‌తినిధుల‌తో విద్యాసాగ‌ర్ మాట్లాడుతూ… అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ లాంబా, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ నేతృత్వంలో షిర్డీలో 18వ జాతీయ మ‌హా స‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్నారు. మ‌హాస‌భ‌ల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన దాదాపు 1200 మందికి పైగా ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతార‌ని.. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఆత్మీయ అతిథులుగా వివిధ స‌మాఖ్య‌ల‌కు సంబంధించిన ప్ర‌తినిధులు హాజ‌రుకానున్న‌ట్లు తెలిపారు.

మ‌న రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల‌కు చెందిన వంద మంది ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు స‌ద‌స్సుకు త‌ర‌లివెళ్తున్నార‌న్నారు. స‌మావేశంలో పాల్గొనే ప్ర‌తినిధుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రోజులు స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్ మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించి వివిధ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తుల ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగిందని.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ద‌శ‌ల వారీగా ప‌రిష్క‌రించేందుకు సానుకూల దృక్ప‌థంతో ఉంద‌న్నారు.

మ‌హాస‌భ‌ల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సీపీఎస్ అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వివిధ రాష్ట్రాలలో ఉన్న వేతన సవరణ సమస్యలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల మీద చర్చ, అంతర్జాతీయంగా జరుగుతున్న వివిధ పరిణామాల‌పై స‌మావేశాల్లో చ‌ర్చించి, ప‌లు తీర్మానాలు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అదేవిధంగా అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గానికి కూడా ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరుగుతాయ‌ని తెలిపారు. ఎన్నికల్లో జాతీయ ఉపాధ్యక్షుడిగా తిరిగి పోటీచేస్తున్న‌ట్లు ఏపీ ఎన్‌జీజీవో సంఘ రాష్ట్ర అధ్య‌క్షుడు విద్యాసాగ‌ర్ తెలిపారు.


స‌మాఖ్య జాతీయ స‌ద‌స్సులో పాల్గొనేందుకు షిర్డీకి త‌ర‌లివెళ్లిన‌వారిలో ఎ.విద్యాసాగ‌ర్‌, ర‌మ‌ణ‌ల‌తో పాటు రాష్ట్ర సంఘ ప్ర‌తినిధులు భార‌తీ ప్ర‌సాద్, కె.జ‌గ‌దీశ్వ‌ర‌రావు, సుబ్బారెడ్డి, రంజిత్ నాయుడు, మ‌హిళా ప్ర‌తినిధులు జాన‌కి, రాజ్య‌ల‌క్ష్మి, శాంతిశ్రీ, స‌రస్వ‌తి, సురేఖ‌, శివ‌లీల‌, విజ‌య‌శ్రీ, ల‌లితాంబ‌, క్యాపిట‌ల్ సిటీ అధ్య‌క్షుడు నాగ‌భూష‌ణం, వివిధ జిల్లాల అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు, విజ‌య‌వాడ న‌గ‌ర‌శాఖ ప్ర‌తినిధులు ఉన్నారు.

Leave a Reply