సాధకుడు ఆధ్యాత్మిక జీవనము అనే మాటలో రెండు పదాలు ఉన్నాయి కదా. సాధకుడు అనే పదం సాధక్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. సాధక్ అంటే సాధకుడు. రెండో పదం ”ఆధ్యాత్మిక జీవనము” మనిషి నిద్ర లేస్తూనే దైవాన్ని దర్శిస్తుంటారు. జీవితంలో దైవాన్ని ప్రార్థించని మానవుడు, ఉండడు. జీవితం సుఖదు:ఖాల సమ్మేళనం. సుఖంగా ఉన్న రోజుల్లో దైవం గురించి ఆలోచించకపోయినా, దు:ఖాల సమయంలో తప్పక దైవాన్ని ఆశ్రయిస్తున్నారు.
సాధకుడు అంటే ఒక లక్ష్యం కాని, గమ్యం కాని చేరాలనో, సాదించాలనో తపనతో కష్టపడే వాడు. అతనికీ కొన్ని లక్షణాలు ఉండాలి. 1) పట్టుదల, 2) విశ్వాసం, 3) సమయస్ఫూర్తి 4) ఆత్మ విశ్వాసం వంటి లక్షణాలు.
సాధారణంగా సాధకుడు తన లక్ష్యాన్ని ప్రారంభించే ముందు తన ఇష్టదైవాన్ని ప్రార్థించకుండా ఉండడు. అంటే సాధనలో దైవ సహాయాన్ని కోరడమే పరోక్షంగా. అదే మంచి జీవన గమనానికి హతువు అవుతుంది. సాధకుడు ఒక్కో సందర్భంలో గురువును కాని, పెద్దలను కాని ఆశ్రయించి సాధనలో మెలకువలు నేర్చుకోవాలి. విద్యార్థి తను అనుకున్న చదువు పూర్తి చేసేవరకు సాధన చేస్తూంటాడు. ఉద్యోగాన్వేషి ఉద్యోగం సాధన, పిల్లల చదువు వివాహం వంటి విషయాలలో కూడా తల్లితండ్రులు చేసే సాధనలో భగవంతుని ఆశ్రయించకుండా ఉండరు. కొందరు ఆత్మజ్ఞానం సాధించాలి ఆనే కార్యసాధనలో ఉంటారు. ఆత్మజ్ఞానం ఆశించేవారు సర్వసంగపరిత్యాగులై ఉండాలి. అంటే అరిషడ్వర్గాలు వారి దరి చేరవు. చేరినా తృణప్రాయంగా భావించి వదిలేస్తారు. అటువంటి వారు ఆత్మజ్ఞానం పొందడానికి ముందు తన ఉనికిని తెలుసుకోవాలి. అంటే సాధకుడు దైవాన్ని తలవకుండా తన లక్ష్యాన్ని సాధించలేడు అని తెలుస్తోంది కదా.
నేటి యువతరం పరిస్థితి: నేటి యువతరం వారికో లక్ష్యం కనపడదు. జీవితాన్ని చాలా తేలిక భావంతో చూస్తున్నారు. కామోద్రేకంతో, వ్యామోహంతో తప్పుడు పనుల్లో నిమగ్నమయ్యారు తప్ప, జీవితానికి మంచి మార్గాన్వేషణ చేయడం లేదు. పెద్దలు సామాజిక శాస్త్రవేత్తలు దీనిని పరిశోధించి, వారిని మంచి సాధకులుగా చేయాలి. అడవిలో జీవించే ఒక కొండజాతి వానికి శివలింగం కనపడగానే, ఆతృతగా ఆరాధన చేయడం, ఆఖరికి తన కళ్ళు కూడా సమర్పించిన భక్త కన్నప్ప గురించి, ద్రోణాచార్యుడు తిరస్కరించిన, ఒకే లక్ష్యంతో విలువిద్య నేర్చుకొన్న ఏకలవ్యుడు వంటి వారు సాధకులకు ఆదర్శం.
దైవం తోడ్పాటు :—సాధకుడుకి కార్యసాధనలో ఒకోసారి అవాంతరాలు వస్తుంటాయి. నిరుత్సాహ పరిచేవారు ఉంటారు. గమ్యం తెలియకపోవచ్చు. అటువంటి సమయంలో నిగ్రహంగా ఉంటూ, గురువు సలహాలు, సూచనలు, తీసుకుని ముందుకు వెళ్ళాలి. అపుడే తాను సాధకుడు అవుతాడు. జీవన గమనంలో మనకు దైవ సహాయం తప్పనిసరి అని తెలుస్తోంది కదా. అసలు మనం హృదయం స్పందన కాని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆధారం కాని, సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే, కనపడకుండా మనలను నడిపించే శక్తే పరమాత్మ. అందుచేత దైవం లేదు, అని వాదించే నాస్తికులకు కూడా ఏదో ఒక సందర్భంలో దైవాన్ని ఆశ్రయించకుండా ఉండరు. ఉండలేరు కూడా. అందుకే ఒక్క కార్యసాధనకే కాదు, ప్రతీ విషయానికీ దైవం తోడుండవలసిందే.
- అనంతాత్మకుల రంగారావు