అంజుమన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ…

అంజుమన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ…

లీజుదారులకు న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తాం…
డాక్టర్ గోపిరెడ్డి హెచ్చరిక

నరసరావుపేట, ఆంధ్రప్రభ : స్థానిక శ్రీరాంపురంలోని నూతనంగా నిర్మితమవుతున్న అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ షాపుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందని వైయస్సార్ సిపి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం “గుడ్ మార్నింగ్ నరసరావుపేట”సందర్బంగా వరవకట్ట ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018 డిసెంబర్లో స్థానిక శ్రీరాంపురంలోని అంజుమన్ స్థలంలో బతుకుతున్న 72 మందికి చెందిన షాపులను నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో అక్రమంగా కూల్చివేసి వారందరినీ వీధిన పడవేశారని అన్నారు.

2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అంజుమన్ షాపులకు చెల్లించవలసిన మున్సిపల్ బకాయిలలో 35 లక్షలు ప్రత్యేక జీవో ద్వారా క్యాబినెట్ సమావేశంలో మినహాయింపునకు ఆమోదం పొంది, అన్ని అనుమతులు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించటం జరిగిందన్నారు. దాదాపు స్లాబ్ వరకు నిర్మాణాన్ని కొనసాగించామని, అప్పట్లో వక్ఫ్ బోర్డు ద్వారా అనుమతి పొంది ఒక్కొక్క షాపు వారి వద్ద నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకొని,నిర్మాణం అనంతరం ఒక లక్ష రూపాయలు రీఫండ్ చేసేటట్టు వక్ఫ్ సి ఇ ఓ అనుమతులతో ఈ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించామన్నారు.

అయితే నిర్మాణం స్లాబ్ దశలో ఉందనగా2024లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగిందని తెలిపారు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చాక అహలె సున్నత్ జామియా మసీదు సంఘం పేరుతో ప్రస్తుత అంజిమన్ కమిటీ చైర్మన్ రహమతుల్లా ఒక బోగస్ సంస్థను ఏర్పాటు చేసి, ఈ అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ లో 26 షాపులు తన కు చెందినవని , తను ముతవల్లినని ఈ షాపులకు పూర్తి హక్కుదారుడిని నేనే అని నమ్మబలుకుతూ , అంజుమన సంస్థలోని 26 షాపులు అమ్మకం మొదలు పెట్టాడని విమర్శించారు.

ఒక్కొక్క షాపుకు తొమ్మిది లక్షల చొప్పున నాలుగు షాపులు 36 లక్షలకు ఇప్పటికే విక్రయించడం జరిగిందని తెలిపారు.వక్ఫ్ బోర్డ్ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఈ షాపులను అమ్ముకుంటున్నాడని ,ఈ షాపింగ్ కాంప్లెక్స్ పైన కూడా కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని చెప్పి కొంతమంది లాయర్ల దగ్గర కూడా ముందస్తుగా డబ్బులు వసూలు చేయడం జరిగిందని వివరించారు.

అనుమతులు లేని కట్టడాలపై కొంతమంది కోర్టు కు వెళితే ..అనుమతులు లేకుండా నిర్మాణం తగదని కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ,నిర్మాణ పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారని, ఎమ్మెల్యే అరవింద బాబు పేరుతో రసీదులు ముద్రించి మదీనా రసూల్ అనే వ్యక్తి ఒక్కొక్క షాపుకు రెండున్నర లక్షలు వసూలు చేస్తున్నాడని ,ఈ 72 మందికి షాపులు కేటాయించడం లేదని చెబుతూ, కొత్త వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు.

ఇది అక్రమమని, గత ఎనిమిది సంవత్సరాలుగా షాపులు కోల్పోయి వీధిన పడ్డ 72 కుటుంబాల వారికి షాపులు కేటాయించాలని ,వీరికి కాదని వేరే కొత్త వ్యక్తులకు షాపులు అమ్ముకోవడం న్యాయమా?వక్ఫ్ బోర్డు అనుమతులు లేకుండా కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం? ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని ? అని గోపిరెడ్డి నిలదీశారు.

అంజుమన్ సంస్థ నీ సొంత ఆస్తి కాదని తీవ్రంగా హెచ్చరించారు! వక్ఫ్ బోర్డు కు చెందిన ఆస్తులను అక్రమ సంస్థల పేరుతో ఎమ్మెల్యే రసీదులు ఎలా ముద్రిస్తాడని తీవ్రంగా ప్రశ్నించారు. అనధికార అంజుమన్ కాంప్లెక్స్ షాపుల అమ్మకం వ్యవహారంలో ఎమ్మెల్యే అరవింద బాబుకు భారీగా డబ్బులు ముట్ట చెబుతున్నారని తెలిపారు. అందుకే అరవింద బాబు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్పందించడం లేదని, ఈ సందర్భంగా తెలిపారు.

వీధిన పడ్డ 72 కుటుంబాలకు షాపులు కేటాయించకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరాహార దీక్షకు పూనుకుంటామని ,వారికోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని హెచ్చరిక చేశారు.కలెక్టర్ తక్షణమే జోక్యం చేసి ఈ అంజుమన్ షాపుల అక్రమ దందా వ్యవహారాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply