వైద్య శిబిరాన్ని చేనేత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాన్ని చేనేత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ అన్యాలపు నరేష్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కుంట్ల గూడెం గ్రామ చేనేత సహకార సంఘంలో చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కుంట్లగూడెం గ్రామ సర్పంచ్ అన్యాలపు నరేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ వైద్య శిబిరంలో అందిస్తున్న ఆరోగ్య సేవలను ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వినియోగించుకోవాలన్నారు.

ఈ వైద్య శిబిరంలో 67 మంది చేనేత కార్మికులు వైద్య చికిత్సలు పొందగా ఇద్దరినీ భువనగిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తదుపరి చికిత్స కొరకు పంపించారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ నెల 22, 23 తేదీలలో కొయ్యలగూడెం గ్రామ చేనేత సహకార సంఘంలో చేనేత కార్మికుల కుటుంబాలకు వైద్య శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఓ బాల మోహన్ రెడ్డి, తంగేడపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి చింతకింది కాటంరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.