ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రసాద్ డిమాండ్
భీమవరం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి .ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన ఓ ప్రకటనలో స్పందించారు.
విద్యార్థుల సంక్షేమాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం, వారి సమస్యలను వెలుగులోకి తెచ్చే విద్యార్థి సంఘాలను హాస్టళ్లకు దూరం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అన్నారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో, వాటి పరిష్కారం కోసం పోరాడి విజయాలు సాధించడంలో విద్యార్థి సంఘాలు సంఘాలు చారిత్రక పాత్ర పోషించాయి. ఎక్కడో జరిగిన సంఘటన ఆధారంగా ఈ ఉత్తర్వులు ఇచ్చారని వెల్లడించారు. జరిగిన ఘటనపై విచారించి అవసరమైతే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇప్పటికీ రాష్ట్రంలోని అనేక వసతి గృహాల్లో నేటికీ నాణ్యమైన ఆహారం లేకపోవడం, తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, మరుగుదొడ్లు, సిబ్బంది కొరత వంటి అనేక సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, విద్యార్థుల తరఫున ఉద్యమించేది విద్యార్థి సంఘాలే అన్నారు. అలాంటి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం అంటే సమస్యలను పరిష్కరించడం కాకుండా వాటిని బయటకు రాకుండా అడ్డుకోవడమే అన్నారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే హక్కును కల్పించిందన్నారు. విద్యార్థి సంఘాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రజాస్వామ్య సంస్థలని , అలాంటి సంఘాలను హాస్టళ్లలోకి అనుమతించకపోవడం విద్యార్థుల రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను అవమానించడం అన్నారు.
