యోగాంధ్ర-2026కు ఘన శ్రీకారం..

యోగాంధ్ర-2026కు ఘన శ్రీకారం..

ప్రతి ఇంటా యోగా.. ప్రతి మనిషికి ఆరోగ్యం అనే లక్ష్యంతో 14 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు

భారీ సామూహిక యోగా నిర్వహణ

నంద్యాల, (ఆంధ్రప్రభ బ్యూరో): యోగాంధ్ర-2026 ద్వారా ప్రతి ఒక్కరిలో యోగా పట్ల అవగాహన పెంచి, ఆరోగ్యవంతమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.

ఆదివారం ఉదయం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు నిర్వహించిన యోగా ప్రదర్శనలను పరిశీలించిన ఆమె, విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర-2026 కార్యక్రమం జూన్ 7 నుంచి జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజులపాటు నిర్వహించబడుతుందని తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జీవన విధానమని పేర్కొన్నారు.

నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం, సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చని చెప్పారు. యోగా వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి, వ్యక్తిలో ఉల్లాసం, ఉత్సాహం, కార్యదీక్ష మెరుగుపడతాయని వివరించారు.

పాఠశాల విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాంధ్ర-2026 కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు యోగాంధ్ర పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు జిల్లాలోని ప్రతి మండలంలో యోగా శిక్షణ అందిస్తారని తెలిపారు. ఒక్కో ట్రైనర్ సుమారు 50 మందికి 14 రోజులపాటు యోగా సాధనపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

యోగాంధ్ర-2026 విజయవంతానికి కృషి చేస్తున్న యోగా గురువులు, మాస్టర్ ట్రైనర్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఆయుష్ వైద్యులు, డీఎస్‌డీఓ, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply