నష్టం అంశంపై అంచనా కొనసాగుతుంది
- పూర్తి నివేదిక అనంతరం తదుపరి చర్యలు
- జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా
ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : అధిక వేగంతో వీచిన ఈదురుగాలుల కారణంగా ములుగు జిల్లా మంగపేట రేంజ్ పరిధిలోని మంగపేట సెక్షన్, మంగపేట సౌత్ బీట్, కంపార్ట్మెంట్ నెంబర్ 5లో దుంపిడి, కానుగ, ముస్తి, ఈపీ జాతులకు చెందిన కొన్ని చెట్లు నేలకొరిగినట్లు జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా మంగళవారం సాయంత్రం తెలిపారు.
చెట్లు నేలకొరిగిన సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా తెలిపారు. బలమైన గాలుల ప్రభావంతోనే చెట్లు నేలకొరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు, సుమారు 20 నుంచి 30 చెట్లు నేలకొరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశంపై అంచనా కొనసాగుతోందని, పూర్తి నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.
