ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల జోరు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల జోరు..

47 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.
66 వేల మందికి పైగా ఉపాధి

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి దిశగా అడుగులు వేగంగా పడుతున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జీతన్ రామ్ మాంఝీ తెలిపారు. ఎం ఎస్ ఎం ఈ క్లస్టర్ల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురోగతిపై గురువారం లోక్ సభ లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం’ (ఎం ఎస్ ఈ – సిడిపి ) కింద రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 47 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమోదించిన ప్రాజెక్టులలో 11 ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలు (సి ఎఫ్ సి ఎస్ ), 36 మౌలిక సదుపాయాల అభివృద్ధి (ఐడి) ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 66,093 మందికి ఉపాధి లభించిందన్నారు.

ఇందులో కేవలం సి ఎఫ్ సి ల ద్వారా 8,300 మందికి, ఐడి(మౌలిక సదుపాయాల అభివృద్ధి) ప్రాజెక్టుల ద్వారా 57,793 మందికి ఉపాధి దక్కినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ తెలిపారు. ప్రధాన ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి గతలను పరిశీలిస్తే మచిలీపట్నంలోని ఇమిటేషన్ జ్యువెలరీ, విజయవాడ, జగ్గయ్యపేటలోని గోల్డ్ ఆర్నమెంట్ క్లస్టర్లు, తూర్పుగోదావరి జిల్లా రాయవరంలోని పప్పుధాన్యాల క్లస్టర్, కాకినాడలోని ప్రింటింగ్ క్లస్టర్లు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు.

రాజమండ్రిలో ఫర్నిచర్, నెల్లూరులో హోజరీ, రెడీమేడ్ దుస్తులు, తిరుపతిలో ప్రింటింగ్, శ్రీకాకుళంలో ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 6 క్లస్టర్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, తడ, నంద్యాల వంటి ప్రాంతాల్లో పాత పారిశ్రామిక ఎస్టేట్ల ఆధునీకరణతో పాటు కొప్పర్తి (కడప), గండ్రాజుపల్లి (చిత్తూరు) వంటి ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక ఎస్టేట్ల నిర్మాణం పూర్తయినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళలను స్వయం ఉపాధి వైపు మళ్లించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 90,207 మంది మహిళలకు ప్రాథమిక శిక్షణ అందించడం జరిగిందని వివరించారు.

అదేవిధంగా పీఎంఈజీపీ పథకం ద్వారా రాష్ట్రంలో 1,56,567 మహిళా నేతృత్వంలోని సూక్ష్మ పరిశ్రమలకు చేయూత లభించిందన్నారు. గత ఐదేళ్లలో 28,388 మంది మహిళలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ( ఈ ఎస్ డి పి) ద్వారా ప్రయోజనం పొందారన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో సాధారణంగా 60 శాతం నుండి 70 శాతం వరకు గ్రాంట్లు అందిస్తోందనీ, మహిళా, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆస్పిరేషనల్ జిల్లాల్లో (విజయనగరం వంటివి) చేపట్టే ప్రాజెక్టులకు గరిష్టంగా 80 శాతం వరకు అంటే రూ. 15 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. క్లస్టర్లలోని సమస్యలను పరిష్కరించేందుకు కాలానుగుణంగా మార్గదర్శకాలను సవరిస్తున్నట్లు కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు.

Leave a Reply