30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తి అరెస్ట్
పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయం
కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచిన వ్యక్తిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన శిరిగిరి సాగర్ తండ్రి లక్ష్మరాజం తన ఇంట్లో ప్లాస్టిక్ సంచుల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
పోలీసులు చేరుకోగానే పరారయ్యేందుకు ప్రయత్నించిన సాగర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కొంతకాలంగా గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో పేదల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంటి వద్ద నిల్వ ఉంచుతున్నట్లు వెల్లడైనట్లు సీఐ తెలిపారు.
అనంతరం సమీపంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలు, పౌల్ట్రీ ఫారాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా సుమారు 37 సంచుల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభించింది. పంచాయతీదారుల సమక్షంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
