ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు
- సిబ్బంది పనితీరు, ప్రజాసేవలపై సమీక్ష
- వేగవంతమైన సేవలందించాలని జేసీ కల్పశ్రీ ఆదేశం
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సత్వర సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమయపాలన పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయాల్లో పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కార్యాలయ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా పీజీఆర్ఎస్ ప్రత్యేక అధికారి వై. దోసిరెడ్డి తదితరులు జాయింట్ కలెక్టర్ వెంట ఉన్నారు.
